8th Pay Commission: ఉద్యోగుల జీతాల పెంపుతో ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది?
8వ వేతన సంఘం అమలుతో సుమారు 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. జేపీ మోర్గాన్ అంచనాల ప్రకారం జీతాలు సుమారు 14 శాతం పెరిగే అవకాశం ఉండగా, ప్రభుత్వంపై రెండేళ్లలో రూ.7.2 లక్షల కోట్ల వరకు అదనపు భారం పడవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) అమలుపై ఆసక్తి నెలకొంది. కొత్త పే కమిషన్ అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఖజానాపై భారీ ఆర్థిక భారాన్ని మోపనుంది. ప్రముఖ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ (JPMorgan) అంచనాల ప్రకారం 8వ వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.7.2 లక్షల కోట్ల అదనపు వ్యయం చేయాల్సి రావచ్చు.
జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ వేతన సవరణ ద్వారా ప్రయోజనం కలగనుంది. ఉద్యోగుల స్థూల వేతనాల్లో సుమారు 14 శాతం పెరుగుదల ఉండవచ్చని అంచనా వేసింది. ఇందుకోసం 1.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను పరిగణనలోకి తీసుకుంది. సగటున ఒక్కో లబ్ధిదారుడికి నెలకు సుమారు రూ.15,400 అదనంగా లభించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
8వ వేతన సంఘం అమలుతో 2028, 2029 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వంపై అదనపు వ్యయం పడనుంది. ఇందులో 2028 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2.5 లక్షల కోట్లు, 2029 ఆర్థిక సంవత్సరంలో రూ.4.6 లక్షల కోట్లు ఖర్చు కావచ్చని అంచనా. మొత్తంగా ఈ రెండేళ్లలో రూ.7.2 లక్షల కోట్ల వరకు వ్యయం ఉండవచ్చు.
కొత్త వేతన సవరణను 2026 జనవరి 1 నుంచి అమలు చేస్తే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు (Arrears) సుమారు రూ.4 లక్షల కోట్లకు చేరవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. అదే 2027 జనవరి 1 నుంచి అమలు చేస్తే ఈ బకాయిల భారం రూ.1.8 లక్షల కోట్లకు తగ్గవచ్చని తెలిపింది.
అయితే ఇవన్నీ ఆర్థిక సంస్థ చేసిన అంచనాలు మాత్రమే. ఫిట్మెంట్ ఫ్యాక్టర్, జీతాల పెంపు, అమలు తేదీ, బకాయిల చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 8వ వేతన సంఘం సిఫార్సులు, ప్రభుత్వ ఆమోదం తర్వాతే ఉద్యోగుల వేతనాల్లో వాస్తవంగా ఎంత పెరుగుదల ఉంటుందో స్పష్టత రానుంది.