Vatsala Rajagopal: ‘అదుర్స్’ బామ్మ ఇక లేరు.. 400కు పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటి కన్నుమూత!
దక్షిణాది సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ (92) చెన్నైలో కన్నుమూశారు. 1992లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోజా’ సినిమాతో 60 ఏళ్ల వయసులో వెండితెరకు పరిచయమైన ఆమె.. 400కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో ఎన్టీఆర్ నటించిన ‘అదుర్స్’ సినిమాలో చారి బామ్మగా నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు.
దక్షిణాది సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఎన్నో సినిమాల్లో బామ్మ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఇవాళ చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 92 ఏళ్లు. వత్సలా రాజగోపాల్ మరణవార్తతో తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో విషాదం అలుముకుంది. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
వత్సలా రాజగోపాల్ నటనా ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. తొలుత నాటకరంగంలో అడుగుపెట్టిన ఆమె.. రంగస్థలంపై తన ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లోకి రావడానికి మాత్రం ఆమెకు చాలా సమయం పట్టింది. తన 60 ఏళ్ల వయసులో, 1992లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో హీరోయిన్ మధుబాల బామ్మగా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 400కు పైగా సినిమాల్లో నటిస్తూ వెండితెరపై తనదైన ముద్ర వేశారు.
తెలుగు ప్రేక్షకులకు వత్సలా రాజగోపాల్ అనగానే ముందుగా గుర్తొచ్చే సినిమా ‘అదుర్స్’. వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో చారి పాత్రకు బామ్మగా ఆమె కనిపించారు. ఎన్టీఆర్‌తో కలిసి ఆమె పండించిన హాస్యం, చమత్కారమైన సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తమిళంలో ‘రోజా’, ‘సతి లీలావతి’, ‘అన్నియన్’, ‘రిథమ్’, ‘మొళి’ వంటి చిత్రాలతోనూ ఆమె గుర్తింపు పొందారు. తెరపై సంప్రదాయబద్ధమైన బామ్మగా, కుటుంబ పెద్దగా, ఆప్యాయతను పంచే పాత్రల్లో సహజమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.
వెండితెరతో పాటు బుల్లితెరపైనా వత్సలా రాజగోపాల్ తనదైన ముద్ర వేశారు. ‘చిత్తి’, ‘ఆనందం’, ‘ముందానై ముడిచ్చు’, ‘వసంతం’ వంటి ప్రముఖ తమిళ సీరియల్స్‌లో నటించి టీవీ ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. వయసు మీద పడిన తర్వాత కూడా నటనపై ఆసక్తిని కొనసాగిస్తూ.. రంగస్థలం, సినిమా, టెలివిజన్ రంగాల్లో తనదైన ప్రయాణాన్ని సాగించారు. ముఖ్యంగా ‘అదుర్స్’లో బామ్మ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని అందించారు. ఆమె మరణంతో దక్షిణాది చిత్ర పరిశ్రమ ఒక ప్రతిభావంతమైన సీనియర్ నటిని కోల్పోయింది.