వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వార్తలు | రచన: Kalyan |

Cyclone Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్.. ఈ తేదీన తీరం దాటే ఛాన్స్, తెలంగాణకూ వర్ష సూచన!

Cyclone Alert

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ తీవ్ర తుఫానుగా బలపడి ఏపీ తీరంవైపు దూసుకొస్తోంది. నవంబర్ 20న ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్ఠంగా 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ క్రమంగా బలపడుతూ ఏపీ తీరంవైపు దూసుకొస్తోంది. ఇప్పటికే తీవ్ర తుఫాన్‌గా మారిన ఈ వాయుగుండం ప్రభావంతో తీర ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నవంబర్ 20న ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నవంబర్ 18 ఉదయం 10:30 గంటల నాటికి అక్వాన్ తుఫాన్ దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పున 570 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 580 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తుఫాన్ నవంబర్ 20 మధ్యాహ్నం నర్సాపూర్ నుంచి పూరి మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తాజా బులెటిన్‌లో వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, బలమైన గాలుల ముప్పు ఉండటంతో రాష్ట్ర యంత్రాంగం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటించాలని, సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్ కదలికలు, తీవ్రతలో మార్పులు ఉండే అవకాశం ఉండటంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని గమనించాలని సూచిస్తున్నారు. అటు తెలంగాణలోనూ రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని.. తూర్పు తెలంగాణలో ఒకటి రెండు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. అక్వాన్ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండటం మంచిది.