Kanakadurga: నవరాత్రుల వేళ దుర్గమ్మ భక్తులకు స్పెషల్ ట్రీట్.. తమన్ పాట విడుదల!
నవరాత్రుల సందర్భంగా ‘కనకదుర్గ’ సినిమా నుంచి ‘అమ్మ కనకదుర్గ’ తొలి పాట విడుదలైంది. తమన్ సంగీతం అందించిన ఈ గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించారు.
నవరాత్రి పర్వదినాల వేళ దుర్గమ్మ భక్తులకు సినీ బృందం ప్రత్యేక కానుక అందించింది. బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట ‘అమ్మ కనకదుర్గ’ విడుదలైంది. విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పాటను ఆవిష్కరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఎస్ స్వరాలు సమకూర్చగా, సిరాశ్రీ సాహిత్యం అందించారు. జీ మ్యూజిక్ కంపెనీ ఈ గీతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
కనకదుర్గమ్మ దివ్యశక్తి, ఆధ్యాత్మిక వైభవం, భక్తుల ఆరాధనా భావాన్ని ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు. అమ్మవారికి ప్రసిద్ధి చెందిన విజయవాడలోనే పాటను విడుదల చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. నవరాత్రులు, భవానీ దీక్షల సమయంలో లక్షలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకునే ఈ నగరంతో పాటకు ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది.
తమన్‌కు కనకదుర్గమ్మపై ప్రత్యేక భక్తి ఉందని చిత్ర బృందం తెలిపింది. ఆ భావోద్వేగం పాటలోనూ ప్రతిఫలించిందని పేర్కొంది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తుండగా, కథను బీవీఎస్ రవి అందించారు. ఈ సినిమా కోసం అల్లరి నరేశ్ భవానీ దీక్ష నియమాలను పాటిస్తూ, షూటింగ్ సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండటంతో పాటు చెప్పులు ధరించలేదని సమాచారం. భక్తి, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుగా రూపొందుతున్న ‘కనకదుర్గ’తో చిత్ర బృందం ప్రమోషన్లను ప్రారంభించింది.