వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

Amalapuram: లడ్డూ కాదు.. అమ్మవారి తొలి పూలదండ కోసం రూ.1.53 లక్షలు.. ఎందుకంత ప్రత్యేకమంటే?

Amalapuram
లడ్డూ కాదు.. అమ్మవారి తొలి పూలదండ కోసం రూ.1.53 లక్షలు.. ఎందుకంత ప్రత్యేకమంటే? Photo: లడ్డూ కాదు.. అమ్మవారి తొలి పూలదండ కోసం రూ.1.53 లక్షలు.. ఎందుకంత ప్రత్యేకమంటే?

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయంలో విజయదశమి సందర్భంగా నిర్వహించిన పూలదండ వేలంపాటలో హైదరాబాద్ వ్యాపారవేత్త ఆకుల లక్ష్మణరావు రూ.1.53 లక్షలకు తొలి పూలదండను దక్కించుకున్నారు.

సాధారణంగా వినాయక చవితి వచ్చిందంటే లడ్డూల వేలంపాటలు గుర్తుకొస్తాయి. కొన్ని ఆలయాల్లో అమ్మవారి చీరలు, నగలకు కూడా భారీ ధరలు పలుకుతుంటాయి. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాత్రం ఓ పూలదండ కోసం నిర్వహించిన వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిషాసురమర్దిని అమ్మవారి మెడలో తొలి పూలదండ వేసే అవకాశం కోసం ఏకంగా రూ.1.53 లక్షలు వెచ్చించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ అవకాశాన్ని దక్కించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమలాపురంలోని రవణం వీధిలో కొలువైన శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయంలో 79వ విజయదశమి సందర్భంగా ఈ సంప్రదాయ వేలంపాట నిర్వహించారు. అమ్మవారి మెడలో తొలిగా అలంకరించే పూలదండ కోసం భక్తులు వేలంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఆకుల లక్ష్మణరావు అత్యధికంగా రూ.1,53,000 ధర పలికి పూలదండను సొంతం చేసుకున్నారు. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా ఈ ప్రత్యేక అవకాశం ఆయనకే దక్కింది. అమలాపురానికి చెందిన లక్ష్మణరావు ప్రస్తుతం హైదరాబాద్‌లో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. గతంలో ఆన్‌లైన్‌లో వేలంలో పాల్గొన్న ఆయన ఈసారి స్వయంగా అమలాపురానికి వచ్చి వేలంపాటలో పాల్గొనడం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సుమారు 14 ఏళ్ల క్రితం కేవలం రూ.3,500తో ప్రారంభమైన ఈ పూలదండ వేలం విలువ ఇప్పుడు రూ.1.53 లక్షలకు చేరింది. అమ్మవారిపై ఉన్న భక్తితో లక్ష్మణరావు ఆలయంలోని అమ్మవారి విగ్రహానికి లక్షల రూపాయలతో టేకు చెక్కతో మందిరాన్ని కూడా చేయించినట్లు సమాచారం. అమ్మవారి అనుగ్రహంతో తన వ్యాపారం అభివృద్ధి చెందిందని, తన పిల్లలు కూడా విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని లక్ష్మణరావు తెలిపినట్లు సమాచారం. అమ్మవారిపై ఉన్న భక్తితోనే ప్రతి ఏడాది ఈ వేలంలో పాల్గొంటున్నట్లు ఆయన వివరించారు. వరుసగా మూడోసారి వేలంలో విజయం సాధించిన లక్ష్మణరావును ఆలయ కమిటీ సభ్యులు గజమాలతో సత్కరించారు. విజయదశమి సందర్భంగా ఆయన దక్కించుకున్న పూలదండను అమ్మవారి మెడలో అలంకరించనున్నారు. సాధారణంగా లడ్డూల వేలంపాటల గురించి ఎక్కువగా వింటుంటాం. కానీ అమలాపురంలో అమ్మవారి మెడలో తొలి పూలదండ వేసే అవకాశానికి ఇంతటి ధర పలకడం ప్రత్యేకంగా నిలిచింది. భక్తి, సంప్రదాయం, అమ్మవారిపై విశ్వాసం కలగలిసిన ఈ వేలంపాట స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రూ.3,500తో మొదలైన వేలం లక్షన్నర రూపాయలు దాటడం ఈ సంప్రదాయానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది.