Big B: దేవుడు ఇన్ని ఇచ్చేశాడేంటి.. నేనేం చేయాలి.. అమితాబ్ పోస్ట్ వెనుక అసలు కథ ఇదేనా..?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో సంపద, జీవితం, మానవ స్వభావం గురించి చేసిన తాత్విక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మనిషి కోరుకున్నదానికంటే ఎక్కువ లభించినప్పుడు దాన్ని ఎలా స్వీకరించాలనే భావనను ఆయన పంచుకున్నట్లు సమాచారం.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పటికప్పుడు తన బ్లాగ్ ద్వారా అభిమానులతో వ్యక్తిగత విషయాలు, జీవిత అనుభవాలను పంచుకునే ఆయన.. తాజాగా సంపద, జీవితం, మనిషి ఆలోచనా విధానం గురించి చేసిన తాత్విక వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మనిషి ఏమీ లేనప్పుడు ఎన్నో కావాలని కోరుకుంటాడని, కోరుకున్నదానికంటే ఎక్కువ లభించినప్పుడు మాత్రం వాటిని ఏం చేసుకోవాలో ఆలోచనలో పడతాడనే భావనను తన పోస్ట్‌లో వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దేవుడిని మనం ఏదో ఒకటి అడిగితే.. ఆయన మన ఊహకు మించి ఇవ్వొచ్చనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. దీంతో ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
అంతేకాదు.. ప్రపంచం మనం అనుకున్నట్లుగా నడవదని, పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ముందుకు సాగాలని అమితాబ్ తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. ప్రపంచం వేగంగా ముందుకు వెళ్తున్నప్పుడు మనమూ దానితో పాటు అడుగులు వేయగలిగితేనే వెనుకబడకుండా ఉండగలమనే సందేశాన్ని ఇచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల్లో జీవితానుభవం కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పోస్ట్‌లోని వ్యాఖ్యలను ఆయన ఎవరినైనా ఉద్దేశించి చేశారా? లేక సాధారణ జీవిత సత్యాలనే పంచుకున్నారా? అన్నది మాత్రం స్పష్టంగా తెలియదు.
ఇదిలా ఉంటే, అమితాబ్ కుటుంబానికి చెందిన ముంబైలోని జుహూ బంగ్లా 'జల్సా' ప్రస్తుతం ఆస్తి వివాదంతో వార్తల్లో నిలిచింది. అమితాబ్ సోదరుడు అజితాబ్ బచ్చన్ భార్య రమోలా బచ్చన్.. 1993లో జల్సా యాజమాన్యాన్ని జయా బచ్చన్‌కు బదిలీ చేసినట్లు చెబుతున్న గిఫ్ట్ డీడ్‌ను సవాల్ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ బదిలీ గురించి తనకు తెలియదని, తన సమ్మతి లేకుండానే జరిగిందని ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకవైపు కపోల్ హౌసింగ్ సొసైటీ రికార్డుల్లో జయా బచ్చన్ పేరు ఉన్నట్లు వార్తలు వస్తుండగా, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రాపర్టీ కార్డులో మాత్రం రమోలా పేరు కొనసాగుతోందని కథనాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై అంధేరీ డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైనట్లు కూడా వెల్లడైంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే అమితాబ్ చేసిన తాత్విక వ్యాఖ్యలు బయటకు రావడంతో నెటిజన్లు ఆయన పోస్ట్‌ను జల్సా వివాదంతో ముడిపెడుతూ చర్చించుకుంటున్నారు. అయితే తన బ్లాగ్‌లోని మాటలు కుటుంబ ఆస్తి వివాదాన్ని ఉద్దేశించే రాశారని చెప్పడానికి ఎలాంటి నిర్ధారణ లేదు. మరోవైపు, జల్సా యాజమాన్యంపై వచ్చిన ఆరోపణలపైనా అధికారులు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అమితాబ్, జయా బచ్చన్ వైపు నుంచి ఈ వివాదంపై అధికారిక స్పందన వెలువడినట్లు కూడా తాజా వార్తా కథనాల్లో లేదు. దీంతో ఒకవైపు బిగ్ బి బ్లాగ్ పోస్ట్, మరోవైపు జల్సా ఆస్తి వ్యవహారం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి.