Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ బెదిరింపు.. ముంబైలో కలకలం!
అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ ముంబైలోని ఓ పాఠశాలకు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది.
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన బంగ్లాను పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ ముంబైలో కలకలం రేపింది. శుక్రవారం ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలకు ఈ బెదిరింపు సందేశం వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
ఈ బెదిరింపులో అమితాబ్ బచ్చన్ ముంబైలో నివసించే బంగ్లాల్లో ఏది లక్ష్యంగా చేసుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయనకు చెందిన
జల్సా, ప్రతీక్ష బంగ్లాల్లో దేనిని ప్రస్తావించారనే కోణంలో వివరాలు పరిశీలిస్తున్నారు. బెదిరింపు ఈమెయిల్ వెనుక ఎవరున్నారు? దాన్ని ఎక్కడి నుంచి పంపించారు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ముంబైలో గతంలోనూ ఇలాంటి బెదిరింపులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ముంబై మహానగర పాలక సంస్థ కార్యాలయానికి బెదిరింపు ఈమెయిల్ రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.
ఈ ఏడాది మార్చి 20న ముంబై ప్రెస్ క్లబ్‌కు కూడా బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. భవనంలో విషవాయువుతో కూడిన చిన్న బాంబులు అమర్చినట్లు అందులో పేర్కొన్నారు. అప్పట్లో తనిఖీలు చేసినప్పటికీ ప్రమాదకర వస్తువులు దొరకలేదు. తాజా బెదిరింపు నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈమెయిల్‌లోని వివరాలు, దాని విశ్వసనీయతపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.