బిగ్ బి ఇంటికి బాంబు బెదిరింపు.. బాంబే హైకోర్టు, బీఎస్ఈ కూడా టార్గెట్.. ముంబైలో కలకలం!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా'తో పాటు బాంబే హైకోర్టు, బీఎస్ఈ, వర్లీ రేస్‌కోర్స్‌లను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో ముంబైలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. పోలీసులు తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం. మెయిల్ పంపిన వ్యక్తి కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం పేరు ప్రస్తావిస్తూ.. వచ్చిన ఓ బాంబు బెదిరింపు ఈ-మెయిల్ ముంబైలో కలకలం రేపింది. ఒకటి కాదు.. ఏకంగా నగరంలోని కీలక ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరుపుతామంటూ ఆగంతకులు హెచ్చరించడంతో పోలీసులు, భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. బాంబే హైకోర్టు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), వర్లీ రేస్కోర్స్తో పాటు అమితాబ్ బచ్చన్ నివాసమైన 'జల్సా' పేరును కూడా ఆ మెయిల్లో ప్రస్తావించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.
శుక్రవారం బాంబే హైకోర్టుకు ఈ బెదిరింపు మెయిల్ అందినట్లు సమాచారం. అందులో కోర్టుతో పాటు మరికొన్ని ప్రముఖ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరుపుతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. బెదిరింపు వచ్చిన ప్రాంతాల వద్ద ముందుజాగ్రత్త చర్యలు చేపట్టి తనిఖీలు నిర్వహించాయి. అమితాబ్ నివాసం 'జల్సా' వద్ద కూడా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు లభించలేదని కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే బెదిరింపు మెయిల్‌ను పోలీసులు తేలిగ్గా తీసుకోవడం లేదు. అసలు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? దీని వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ విభాగం సాయంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఇటీవల ముంబైలో ప్రముఖుల పేర్లు, కీలక ప్రాంతాలను ప్రస్తావిస్తూ ఇలాంటి బెదిరింపు సందేశాలు రావడం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్ 23న ముంబై మేయర్ కార్యాలయానికి వచ్చిన ఓ బెదిరింపు మెయిల్‌లోనూ అమితాబ్ బచ్చన్ నివాసం, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ సంగీత కార్యక్రమం జరిగే ప్రాంతం పేర్లు ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా మెయిల్ కూడా గతంలో వచ్చిన బెదిరింపులతో సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందని అధికారులు ఇప్పటివరకు నిర్ధారించలేదు.