Weather Alert: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం.. ఏపీకి అక్వాన్ తుఫాన్ ముప్పు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది నవంబర్ 15 నాటికి వాయుగుండంగా, నవంబర్ 16 సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సముద్రంలో అలలు ఉధృతంగా ఉండే సూచనలు ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏపీ ప్రజలకు మరోసారి తుఫాన్ భయం మొదలైంది. ఒకదాని తర్వాత మరొకటి తుఫాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుండటంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత తుఫాన్ల నష్టం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉండటంతో వాతావరణ పరిస్థితులపై ఉత్కంఠ నెలకొంది. ఈ కొత్త తుఫాన్‌కు అక్వాన్ (Aqwan) అని పేరు పెట్టారు. ఇరాన్ ఈ పేరును సూచించింది.
ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న సుస్పష్ట అల్పపీడన ప్రాంతం మరింత బలపడే దిశగా కదులుతోంది. నవంబర్ 14 ఉదయం 8.30 గంటల నాటికి ఇదే ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఈ వ్యవస్థ రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 16 సాయంత్రానికి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడవచ్చని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఏపీ, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం మూడు రోజుల సూచనలను వెల్లడించింది. కోస్తాంధ్ర, యానాంతో పాటు రాయలసీమలోనూ నవంబర్ 14, 15, 16 తేదీల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే సముద్రంలో వాతావరణం క్రమంగా మారుతుండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలలు ఉధృతంగా ఎగిసిపడే అవకాశం ఉన్నందున చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.
ఇక ఈ అక్వాన్ తుఫాన్ ప్రభావం ఏపీపై ఎలా ఉండబోతోందనే చర్చ మొదలైంది. ప్రస్తుత అంచనాల ప్రకారం మచిలీపట్నం, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీవ్రత పెరిగితే తీర ప్రాంత జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే తుఫాన్ కదలిక, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రోడ్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. ఇంతలోనే మరో తుఫాన్ ముప్పు పొంచి ఉండటం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. అక్వాన్ తుఫాన్ ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏయే ప్రాంతాలకు ముప్పు ఉంటుంది? భారీ వర్షాలు ఎక్కడ కురుస్తాయి? అనే అంశాలపై వాతావరణ శాఖ తదుపరి నివేదికలు కీలకం కానున్నాయి.