Cyclone Alert: ఏపీకి మరో తుఫాను ముప్పు.. ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో వర్ష సూచనలు ఉండటంతో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వాతావరణ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పరిస్థితిని సమీక్షించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
వాయుగుండం తుఫానుగా మారితే కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. తుఫాను కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేయాలని స్పష్టం చేశారు.
వర్షాలు, ఈదురుగాలుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలకు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పరిస్థితి తీవ్రతను బట్టి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారికి అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.
మరోవైపు గతంలో కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. వాటిని కేవలం నివేదికలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. తుఫాను ముప్పు ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు, ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రానున్న రెండు రోజులు వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు.