Annavaram: అన్నవరంలో ఎందుకిలా.. కార్తీకమాసంలో మారిన దారుల వెనుక అసలు కారణమేంటి..?
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా దర్శనం అనంతరం బయటకు వెళ్లే మార్గాల్లో మార్పులు చేశారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. గతంలో స్వామి దర్శనం తర్వాత నేరుగా బయటకు వెళ్లే అవకాశం ఉండేదని, ప్రస్తుతం బారికేడ్లు ఏర్పాటు చేసి ఇరుకైన మార్గాల్లో పంపిస్తున్నారని చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా గుర్తుకొచ్చే పుణ్యక్షేత్రాల్లో అన్నవరం ఒకటి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. అన్నవరంలో ప్రతినెల దాదాపు 30 వేల నుంచి 50 వేల వరకు వ్రతాలు జరుగుతుండగా, కార్తీక మాసంలో ఈ సంఖ్య లక్షకు పైగా చేరుతుందని చెబుతారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన క్షేత్రంలో భక్తులకు దర్శనం, రాకపోకలు సులభంగా ఉండేలా ఏర్పాట్లు చేయడం ఎంతో ముఖ్యం.
ఇక కార్తీక మాసం అంటే దీపారాధనకు ప్రత్యేక స్థానం. ఈ నేపథ్యంలో అన్నవరం దేవస్థానం క్షేత్ర వృక్షంగా భావించే రావిచెట్ల వద్ద భక్తులు దీపాలు వెలిగించేందుకు భక్తులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో అక్కడే ఆవునేతి దీపాల స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏర్పాట్లు భక్తులకు సౌకర్యంగా ఉన్నాయా? లేక ఇబ్బందులకు కారణమవుతున్నాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి.
సాధారణ రోజుల్లో సత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం భక్తులు నేరుగా బయటకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ కార్తీక మాసం ప్రారంభమైన తర్వాత బయటకు వెళ్లే మార్గంలో మార్పులు కనిపిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి, సులభంగా బయటకు వెళ్లే మార్గాలను మూసివేయడంతో భక్తులు ఇరుకైన దారుల గుండా వెళ్లాల్సి వస్తోందని, దీంతో అసౌకర్యం ఎదురవుతోందని వాపోతున్నారు. దర్శనం తర్వాత త్వరగా బయటకు వెళ్లాలనుకునే వారికి ఈ మార్గాల మార్పు ఎందుకు అన్నది అర్థం కావడం లేదంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు చెందిన దీపాల స్టాల్ పక్క నుంచి బయటకు వెళ్లే మార్గం ఏర్పాటు చేయడంపై మండిపడుతున్నారు.
రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించడం కార్తీక మాసంలో భక్తులకు ఎంతో సెంటిమెంట్‌తో కూడుకున్న విషయం. అయితే దీపాలు వెలిగించాలనుకునే భక్తులంతా ఆ ప్రాంతానికి చేరుకునేలా ఇతర మార్గాలను మూసివేసి, ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా అక్కడికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీపారాధన కోసం భక్తులు ఆవునేతి దీపాలు కొనుగోలు చేసేలా ఈ మార్గాలను నిర్దేశించారా? ఈ ఏర్పాట్ల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? భక్తులకు సౌకర్యం కల్పించడమే లక్ష్యమా? లేక మరేదైనా కారణం ఉందా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
భక్తుల రద్దీని నియంత్రించేందుకు మార్గాల మార్పు చేశారా? అయితే అందరికీ సులభంగా అర్థమయ్యేలా సూచికలు ఏర్పాటు చేయలేరా? దర్శనం తర్వాత నేరుగా బయటకు వెళ్లే సౌకర్యాన్ని ఎందుకు తగ్గించారు? భక్తులను ఇబ్బందులకు గురిచేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎందుకు కల్పించలేదు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ మార్పులపై అన్నవరం దేవస్థానం అధికారులు స్పందించి, భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకుంటారా? మార్గాల మార్పు వెనుక కారణాలను వివరిస్తారా? అన్నది వేచి చూడాలి.