AP Cyclone: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర తుఫాను.. 20 మండలాలకు అతి భారీ వర్ష సూచన..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి నవంబరు 3న బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తీవ్ర తుఫానుగా మారే సూచనలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం ఎలా ఉండబోతోంది..? ఏయే ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది? అనే అంశాలపై అధికారులతో చర్చించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సీఎం తన రేపటి ఢిల్లీ పర్యటనను కూడా రద్దు చేసుకుని తుఫాను పరిస్థితుల పర్యవేక్షణపై దృష్టి పెట్టారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత బలపడి నవంబరు 2 నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. అనంతరం నవంబరు 3వ తేదీ ఉదయం బాపట్ల సమీపంలో తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబరు 2 నుంచి రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరగనుండగా, 3, 4 తేదీల్లో దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
అధికారుల అంచనాల ప్రకారం నవంబరు 3న ఏలూరు జిల్లాలో సగటున 179 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లాలో 163 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 161 మిల్లీమీటర్లు, పశ్చిమ గోదావరిలో 147 మిల్లీమీటర్లు, గుంటూరులో 119 మిల్లీమీటర్లు, బాపట్లలో 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాకు చెందిన 9, కృష్ణా జిల్లాలో 5, ఎన్టీఆర్ జిల్లాలో 5, బాపట్ల జిల్లాలో ఒక మండలం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు విజయవాడ సమీపంలోని బుడమేరుకు నవంబరు 3న సుమారు 32,500 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర ప్రాంతాల్లోనూ వరద పరిస్థితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సీఎం ఆదేశించారు.
తుఫాను ప్రభావంతో విద్యుత్ వ్యవస్థకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. భారీ ఈదురుగాలుల కారణంగా 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు రూపొందించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా అదనపు సిబ్బంది, అవసరమైన పరికరాలను సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. ఇదే సమయంలో ఇటీవల వచ్చిన అర్నబ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ పనుల పురోగతిని కూడా సమీక్షించారు. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అదే రోజు రాత్రికి పూర్తిగా పునరుద్ధరిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.
తీరప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం సూచించింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్నందున అక్కడి ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సహాయక బృందాలను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తంగా మరో తుఫాను ముప్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న రెండు మూడు రోజులు రాష్ట్రానికి కీలకం కానుండటంతో ప్రజలు వాతావరణ శాఖ, ప్రభుత్వ అధికారుల సూచనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.