Cyclone Alert: ఏపీకి మరో తుఫాను ముప్పు.. ఈసారి ఏ జిల్లాలపై ప్రభావం ఉండొచ్చంటే..?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వరుస తుఫానుల ప్రభావాన్ని ఎదుర్కొన్న రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వరుస తుఫానుల ప్రభావాన్ని ఎదుర్కొన్న రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వ్యవస్థ వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 14 నాటికి సుస్పష్టమైన అల్పపీడనంగా, 15వ తేదీ ఉదయానికి వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఉత్తర వాయవ్య దిశగా పయనించి నవంబర్ 16 సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా. అదే జరిగితే దీనికి ‘అక్వాన్’గా నామకరణం చేయనున్నారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈఓ ప్రఖర్ జైన్ ఈ వాతావరణ వ్యవస్థ కదలికలపై వివరాలు వెల్లడించారు. ఆదివారం నుంచి సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి తిరిగి రావాలని సూచించారు. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, కోస్తాంధ్ర తీరాల వైపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే దీని ప్రభావం ఏ ప్రాంతంపై ఎంతమేర ఉంటుందనే విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌పై వాతావరణ వ్యవస్థ ప్రభావం కనిపించే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పీఎల్‌ఎన్ మూర్తి వెల్లడించారు. వాయుగుండంగా బలపడిన తర్వాత దాని ప్రయాణ దిశపై మరింత స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రస్తుత అంచనాల ప్రకారం నవంబర్ 19 సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే తుఫాను ఏ దిశగా కదులుతుంది, ఎంత బలపడుతుంది, ఎక్కడ తీరం దాటుతుంది అనే అంశాలపై ఇప్పుడే కచ్చితమైన అంచనాకు రాలేమని స్పష్టం చేశారు.
నవంబర్ 16, 17 తేదీలు ఈ వాతావరణ వ్యవస్థ కదలికలను అంచనా వేయడంలో కీలకం కానున్నాయి. ముఖ్యంగా 17వ తేదీ నాటికి తుఫాను దిశ, తీవ్రతపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అప్పటివరకు వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ తాజా సమాచారాన్ని ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే తుఫాను వార్తలు, తీరం దాటే ప్రాంతాలపై వచ్చే వదంతులను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని ప్రజలకు సూచించారు.