పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటర్లనే అడిగిన ఎన్నికల కమిషనర్.. అక్కడి పరిస్థితి చూసి ఏమన్నారంటే..!
ఏపీలో పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ స్వయంగా పరిశీలించారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు లేవని ఓటర్లు చెప్పడంతో ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందా..? ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు అందుతున్నాయా? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైల్వే వాగన్ వర్క్‌షాప్, విజయవాడ రూరల్ మండలం పాతపాడు, గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అక్కడ ఓటర్ల రాకపోకలు, వారికి కల్పించిన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్న తీరును స్వయంగా గమనించారు.
అయితే, కమిషనర్ కేవలం అధికారుల నుంచి వివరాలు తీసుకోవడంతోనే ఆగిపోలేదు. పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలతోనూ నేరుగా మాట్లాడారు. ఓటు వేసేందుకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. ఎలాంటి సమస్యలు లేవని, ఏర్పాట్లు బాగున్నాయని ఓటర్లు, ఎన్నికల సిబ్బంది చెప్పినట్లు అనిల్ చంద్ర పునేఠ వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, జిల్లా యంత్రాంగాలు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సమర్థంగా చేశాయని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల్లోపు పోలింగ్ పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తామని, రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన ప్రక్రియ పూర్తయ్యాక భద్రపరుస్తామని వివరించారు.
తాను పరిశీలించిన పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా ఉందని, స్ట్రాంగ్ రూమ్‌లలోనూ నిరంతర పర్యవేక్షణ ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎన్నికల అబ్జర్వర్ వి. అభిషేక్‌తోనూ పోలింగ్ సరళిపై చర్చించారు. ఇంకా పోలింగ్ సమయం ఉన్నందున ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అనిల్ చంద్ర పునేఠ పిలుపునిచ్చారు.