AP Elections: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ప్రకటన..!
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారనే ఫిర్యాదులను వెంటనే పరిశీలించాలని, అభ్యర్థులకు భద్రత కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఈ నేపథ్యంలో నామినేషన్లు వేయకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారంటూ ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు ఈ ఫిర్యాదులను తక్షణమే పరిశీలించాలని ఎస్ఈసీ సూచించారు. ఫిర్యాదు చేసిన అభ్యర్థులను ఫోన్లో సంప్రదించి, వారి సమస్యలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. నామినేషన్ల గడువు ముగిసేలోపు అభ్యర్థులు పత్రాలు సమర్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
నిబంధనలకు అనుగుణంగా సమర్పించిన నామినేషన్లను స్వీకరించేలా రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. నామినేషన్ కేంద్రాలకు వెళ్లే సమయంలో అవసరమైన ప్రాంతాల్లో అభ్యర్థులకు వ్యక్తిగత భద్రత కల్పించాలని, వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేలా ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులకు అడ్డంకులు ఎదురుకాకుండా చూడటమే ఈ చర్యల లక్ష్యంగా కనిపిస్తోంది.