తెలుగు సినీ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ నంది అవార్డులు.. ఎప్పటి నుంచంటే..?
తెలుగు సినీ, టెలివిజన్ రంగాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. 2017 నుంచి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని మళ్లీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2017 నుంచి 2024 వరకు ఎంపిక చేసిన విభాగాల్లో, 2025 సంవత్సరానికి అన్ని ప్రధాన విభాగాల్లో అవార్డులు అందించనున్నారు.
తెలుగు సినీ, టెలివిజన్ రంగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులకు శుభవార్త. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మధ్యలో నిలిచిపోయిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల వేడుకలను మళ్లీ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. 2017 నుంచి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డుల ప్రక్రియను పూర్తి చేసి, 2026 డిసెంబర్లో నంది ఫిల్మ్ అవార్డుల వేడుక నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో తమ ప్రతిభకు గుర్తింపు ఎప్పుడు లభిస్తుందా అని ఎదురుచూస్తున్న సినీ ప్రముఖుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
నంది అవార్డుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సెప్టెంబర్ 22న జీఓ ఆర్టీ నంబర్ 1843 జారీ చేసింది. దీని ప్రకారం 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాదికి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, రెండో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌తో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు అందించనున్నారు. అంటే ఈ ఎనిమిదేళ్లకు సంబంధించి ఏడాదికి నాలుగు చొప్పున పురస్కారాలు ఉంటాయి. అయితే 2025 సంవత్సరానికి మాత్రం గతంలో మాదిరిగానే అన్ని ప్రధాన విభాగాల్లో అవార్డుల ఎంపిక చేపట్టనున్నారు. ఈ నిర్ణయంతో ఏయే సినిమాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు దక్కుతాయనే చర్చ మొదలైంది.
నంది ఫిల్మ్ అవార్డుల వేడుకను డిసెంబర్ 2026లో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ కార్యక్రమానికి అమరావతి లేదా విజయవాడ వేదిక కానున్నాయి. మరోవైపు టెలివిజన్ రంగానికి సంబంధించిన నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించింది. 2017 నుంచి 2024 వరకు విజేతల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, నవంబర్‌లో జాబితా ప్రకటించేలా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం. దీంతో ఈసారి అవార్డుల జాబితాలో చోటు దక్కించుకునే చిత్రాలు, కళాకారులు ఎవరనే ఉత్కంఠ నెలకొంది.
సినిమా రంగంతో పాటు టెలివిజన్ కళాకారులకూ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాదికి ఉత్తమ మెగా సీరియల్, రెండో ఉత్తమ మెగా సీరియల్‌తో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు అందించనున్నారు. 2025 సంవత్సరానికి మాత్రం టెలివిజన్ విభాగంలోనూ అన్ని ప్రధాన కేటగిరీల్లో పురస్కారాల ఎంపిక చేపట్టనున్నారు. సీరియళ్లు, టెలిఫిల్మ్స్, టీవీ కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన నటీనటులు, దర్శకులు, రచయితలు, ఇతర సాంకేతిక నిపుణులకు ఈ అవార్డుల ద్వారా గుర్తింపు లభించనుంది.
ఇదిలా ఉంటే, 2017కు ముందు నుంచి పెండింగ్‌లో ఉన్న అవార్డులపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. 2012 నుంచి 2016 వరకు ఇప్పటికే ప్రకటించిన నంది ఫిల్మ్, టీవీ అవార్డులను కూడా ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వీటితో పాటు ఆయా సంవత్సరాలకు సంబంధించిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాల నిర్వహణపైనా దృష్టి పెట్టింది. 1964లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నంది అవార్డులకు లేపాక్షిలోని ప్రసిద్ధ నంది విగ్రహం పేరు పెట్టారు. అప్పట్లో బంగారు, వెండి, కాంస్య నందుల రూపంలో పురస్కారాలు అందించేవారు. కాలక్రమంలో నటీనటులు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులకు వివిధ విభాగాల్లో అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభను గుర్తించి గౌరవించే అత్యున్నత రాష్ట్ర స్థాయి పురస్కారాలుగా నంది అవార్డులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి అవార్డుల ప్రదానోత్సవం మళ్లీ జరగనుండటంతో సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇన్నాళ్లకు మళ్లీ నంది అవార్డుల సందడి మొదలుకానుండటంతో సినీ అభిమానులు కూడా విజేతల జాబితా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.