Ap Health: ఏపీలో ప్రతి 7 మందిలో ఒకరికి ఆ వ్యాధి.. ఆరోగ్య సర్వేలో షాకింగ్ విషయాలు!
ఆంధ్రప్రదేశ్‌లో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్వహించిన ఎన్సీడీ 4.0 సర్వేలో ప్రతి ఏడుగురిలో ఒకరికి బీపీ, ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి షుగర్ ఉన్నట్లు వెల్లడైంది. 2.85 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించగా లక్షల సంఖ్యలో కొత్త కేసులు బయటపడ్డాయి.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇప్పుడు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీపీ, షుగర్ సమస్యలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో తాజాగా ఆరోగ్యశాఖ నిర్వహించిన సర్వే గణాంకాలు బయటపెట్టాయి. రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరు అధిక రక్తపోటుతో, ప్రతి తొమ్మిది మందిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. చాలామందికి తమకు ఈ వ్యాధులు ఉన్నాయనే విషయం కూడా తెలియకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
క్యాన్సర్, బీపీ, షుగర్ వంటి అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి, ప్రజల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ ఎన్సీడీ 4.0 సర్వే చేపట్టింది. ఈ సర్వేలో రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన జనాభాలో 59.63 లక్షల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇది మొత్తం జనాభాలో 13.93 శాతంగా ఉంది. అలాగే 48.95 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు తేలింది. అంటే 11.44 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. బీపీ, షుగర్ రెండూ ఉన్నవారు కూడా రాష్ట్రంలో 34 లక్షల మంది ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
గతేడాది సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సర్వేను ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తయింది. మొత్తం 2.85 కోట్ల మందికి వైద్య సిబ్బంది స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, లక్షల సంఖ్యలో కొత్త బాధితులు బయటపడ్డారు. పరీక్షల్లో కొత్తగా 12.23 లక్షల మందికి బీపీ ఉన్నట్లు, 11.58 లక్షల మందికి షుగర్ ఉన్నట్లు గుర్తించారు. ముందుగా వ్యాధి నిర్ధారణ కాని వారిలో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగులోకి రావడం వైద్య వర్గాలను అప్రమత్తం చేసింది.
జిల్లాల వారీగా చూస్తే కొత్తగా గుర్తించిన బీపీ కేసుల్లో విశాఖపట్నం మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 78,017 మందికి అధిక రక్తపోటు ఉన్నట్లు తేలింది. పశ్చిమగోదారిలో 68,802, తిరుపతిలో 65,504, తూర్పుగోదావరిలో 64,116, వైఎస్సార్ కడప జిల్లాలో 63,141 కేసులు నమోదయ్యాయి. షుగర్ కేసుల్లోనూ విశాఖపట్నమే ముందుంది. ఈ జిల్లాలో 80,692 మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించగా, పశ్చిమగోదావరిలో 67,935, తిరుపతిలో 67,827, వైఎస్సార్ కడపలో 66,914, ప్రకాశం జిల్లాలో 61,415 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
ఇక బీపీ, షుగర్‌తో పాటు క్యాన్సర్ కేసులు కూడా రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా 76 వేలకుపైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, 40 వేల మందికి పైగా ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వ్యాధి లక్షణాలు కనిపించే వరకు వేచి చూడకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం. సరైన ఆహారం, శారీరక వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ వంటి అలవాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.