Inter Exams 2027: ఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఫస్ట్, సెకండ్ ఇయర్ షెడ్యూల్ ఇదిగో..!
ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ పబ్లిక్ పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది. 2027 ఫిబ్రవరి 24 నుంచి ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 25 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలుకానున్నాయి. థియరీ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫిబ్రవరి 24న భాషా పేపర్లు, సంబంధిత సబ్జెక్టుల పేపర్–Iతో పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లిష్ పేపర్–I, మార్చి 1న గణితం/పౌరశాస్త్రం, మార్చి 3న జీవశాస్త్రం/చరిత్ర, మార్చి 5న భౌతికశాస్త్రం/ఆర్థికశాస్త్రం పరీక్షలు ఉంటాయి. మార్చి 9న రసాయనశాస్త్రం/వాణిజ్యశాస్త్రం, మార్చి 12న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్, మార్చి 15న ఆధునిక భాషలు/భూగోళశాస్త్రం పేపర్లు నిర్వహించనున్నారు. దీంతో ఫస్ట్ ఇయర్ థియరీ పరీక్షలు మార్చి 15తో ముగుస్తాయి.
సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫిబ్రవరి 25న భాషా పేపర్లు, సంబంధిత సబ్జెక్టుల పేపర్–IIతో పరీక్షలు మొదలవుతాయి. ఫిబ్రవరి 27న ఇంగ్లిష్ పేపర్–II, మార్చి 2న గణితం/పౌరశాస్త్రం, మార్చి 4న జీవశాస్త్రం/చరిత్ర, మార్చి 8న భౌతికశాస్త్రం/ఆర్థికశాస్త్రం పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 11న రసాయనశాస్త్రం/వాణిజ్యశాస్త్రం, మార్చి 13న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్, మార్చి 16న ఆధునిక భాషలు/భూగోళశాస్త్రం పేపర్లు ఉంటాయి.
థియరీ పరీక్షలతో పాటు ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా బోర్డు ప్రకటించింది. సాధారణ కోర్సుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తి విద్యా కోర్సుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జనవరి 27న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 29న జరగనుండగా, NSQF లెవల్–4 థియరీ పరీక్ష ఫిబ్రవరి 17న నిర్వహించనున్నారు.
అయితే, ఈ టైమ్‌టేబుల్ తాత్కాలికమైనదని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ సెలవులు లేదా ఇతర కారణాల వల్ల పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. పాత సిలబస్ విద్యార్థులకు కొన్ని సబ్జెక్టుల్లో ప్రత్యేక పేపర్లు, తేదీలు వర్తిస్తాయి కాబట్టి తమకు సంబంధించిన షెడ్యూల్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. పరీక్షలకు ఇప్పటి నుంచే సబ్జెక్టుల వారీగా పునశ్చరణ ప్రణాళిక రూపొందించుకోవడంతో పాటు, తాజా సమాచారం కోసం ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.inను పరిశీలించాలని సూచిస్తున్నారు.