ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక బట్టీ పట్టి రాస్తే మార్కులు రావు.. ప్రశ్నపత్రాల్లో కీలక మార్పులు!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 2027-28 విద్యా సంవత్సరం నుంచి PARAKH నిబంధనలకు అనుగుణంగా కొత్త విధానం అమలు చేయనున్నారు. బట్టీ పట్టి రాసే విధానానికి స్వస్తి పలికి, విద్యార్థుల ఆలోచనా శక్తి, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, సృజనాత్మకతను పరీక్షించేలా ప్రశ్నపత్రాలను రూపొందించనున్నారు. అధ్యాపకులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోర్డు కీలక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు పాఠ్యపుస్తకాల్లోని ప్రశ్నలు, సమాధానాలను బట్టీ పట్టి పరీక్షల్లో రాసే విధానానికి స్వస్తి పలకాలని భావిస్తోంది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో PARAKH (పరఖ్) నిబంధనలకు అనుగుణంగా కొత్త తరహా ప్రశ్నలను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.
కొత్త విధానంలో విద్యార్థుల జ్ఞాపకశక్తి కంటే విషయంపై ఉన్న అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పాఠ్యపుస్తకాల్లో ఉన్న సమాధానాలను యథాతథంగా గుర్తుంచుకుని రాసే విధానానికి బదులుగా.. ఒక అంశాన్ని అర్థం చేసుకుని సొంతంగా సమాధానం రాసేలా ప్రశ్నపత్రాలను రూపొందించనున్నారు.
ముఖ్యంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పరీక్షించేలా 10 శాతం ప్రశ్నలను రూపొందించనున్నట్లు సమాచారం. ఒక సమస్యను వివిధ కోణాల్లో పరిశీలించడం, కొత్త ఆలోచనలతో పరిష్కారాలను కనుగొనడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మార్పులకు అనుగుణంగా ప్రశ్నలను రూపొందించేందుకు ఇప్పటికే సబ్జెక్టు నిపుణుల నుంచి ప్రశ్నలను ఆహ్వానించినట్లు సమాచారం. బోర్డు సమావేశంలో వీటికి ఆమోదం లభించిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరానికి ముద్రించే పాఠ్యపుస్తకాల్లో కొత్త తరహా ప్రశ్నలను చేర్చనున్నారు.
విద్యార్థుల్లో సమష్టిగా పనిచేసే నైపుణ్యాలను కూడా అంచనా వేయనున్నారు. ఇతరులతో కలిసి లక్ష్యాలను సాధించడం, బాధ్యతలను పంచుకోవడం, భిన్నమైన అభిప్రాయాలను గౌరవించడం, బృందంగా సమస్యలను పరిష్కరించడం వంటి సామర్థ్యాలకు ప్రాధాన్యం ఉంటుంది.
కొత్త పరీక్షా విధానం అమలుకు అధ్యాపకులను కూడా సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు, PARAKH- NCERT సహకారంతో విజయవాడలో నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. సుమారు 100 మంది ఎంపిక చేసిన అధ్యాపకులు ఇందులో పాల్గొన్నారు.
జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యాలకు అనుగుణంగా పరీక్షల విధానాన్ని మార్చడం ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం. ఈ మార్పులతో విద్యార్థులు కేవలం మార్కుల కోసం చదవకుండా, విషయాలను అర్థం చేసుకుని ఆచరణలో ఉపయోగించుకునే నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.