వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వార్తలు | రచన: Kalyan |

Education News: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఇక బట్టీ చదువులకు చెక్.. పరీక్షల్లో కొత్త విధానం..!

Education News

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక మార్పులు రానున్నాయి. 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో కొత్త ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేసేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్. ఇప్పటివరకు పాఠ్యపుస్తకాల్లోని ప్రశ్నలు, సమాధానాలను బట్టీ పట్టి పరీక్షలు రాసే విద్యార్థులకు ఇకపై కొత్త సవాల్ ఎదురుకానుంది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. విద్యార్థుల్లో కేవలం జ్ఞాపకశక్తిని కాకుండా, విషయ పరిజ్ఞానం, ఆలోచనా శక్తిని పరీక్షించేలా కొత్త విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన PARAKH నిబంధనలకు అనుగుణంగా ఈ మార్పులు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రశ్నపత్రాల్లో 10 శాతం ప్రశ్నలను సృజనాత్మకంగా రూపొందించనున్నారు. అంటే పుస్తకాల్లో ఉన్న సమాధానాలను యథాతథంగా రాస్తే సరిపోదు. ఒక అంశాన్ని విద్యార్థి ఎంతవరకు అర్థం చేసుకున్నారు? దాన్ని నిజ జీవిత పరిస్థితుల్లో ఎలా అన్వయించగలరు? అనే విషయాలను పరీక్షించేలా ప్రశ్నలు ఉండనున్నాయి. కొత్త విధానంలో విద్యార్థుల విశ్లేషణాత్మక ఆలోచన, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే సొంతంగా అభిప్రాయాలను రూపొందించుకోవడం, కొత్త ఆలోచనలతో సమాధానాలు ఇవ్వడం వంటి సామర్థ్యాలను కూడా అంచనా వేయనున్నారు. ఇతరులతో కలిసి పనిచేయడం, విషయాలను అర్థం చేసుకుని సరైన సందర్భంలో ఉపయోగించడం వంటి నైపుణ్యాలపైనా దృష్టి పెట్టనున్నారు. ఈ మార్పులకు అనుగుణంగా ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల్లోనూ మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం సబ్జెక్టు నిపుణుల నుంచి కొత్త తరహా ప్రశ్నలను ఆహ్వానించారు. వాటిని పరిశీలించి ఆమోదించిన తర్వాత కొత్త పాఠ్యపుస్తకాల్లో చేర్చనున్నారు. కొత్త విధానంపై అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. తద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించే విధానంలోనూ మార్పులు తీసుకురానున్నారు. జాతీయ విద్యా విధానం (NEP) 2020 లక్ష్యాలకు అనుగుణంగా కేంద్రం తీసుకొచ్చిన PARAKH విధానం ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసే పద్ధతుల్లో మార్పులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యా మండలి అధికారులకు ఈ విధానంపై అవగాహన కల్పించారు. మొత్తంగా 2027-28 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులతో ఇంటర్ విద్యార్థులు చదివే పద్ధతినే మార్చుకోవాల్సి ఉంటుంది. బట్టీ చదువులకు బదులుగా పాఠాలను అర్థం చేసుకుని, ఆలోచించి చదివే అలవాటు పెంచుకోవడం అవసరం కానుంది.