ఏపీకి పెట్టుబడుల వరద.. 303 ఒప్పందాలు, రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు.. చంద్రబాబు కీలక ప్రకటన..!
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు ఏపీకి భారీ పెట్టుబడులు వస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా 303 ఒప్పందాల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు వెల్లడించారు.
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. తాజాగా 303 ఒప్పందాల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ఈ సదస్సుతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు ప్రకటించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, విదేశీ రాయబారులు, ప్రభుత్వ ప్రతినిధులకు స్వాగతం పలికిన ఆయన.. ఏపీలో ఉన్న అవకాశాలను వివరించారు. విశాఖ దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందిందని, గిరిజన థింసా నృత్యం సహా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో అత్యాధునిక సాంకేతిక రంగాల్లో ఏపీని కీలక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రేర్ ఎర్త్ మాగ్నెట్స్, స్టీల్, సోలార్ వేఫర్స్, సౌర విద్యుత్, బ్యాటరీ ఎనర్జీ వంటి రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుతో పాటు క్వాంటం పరికరాలను 'మేడ్ ఇన్ అమరావతి' పేరుతో తయారు చేసే ప్రణాళిక ఉందన్నారు. అలాగే పౌర అవసరాలు, రక్షణ రంగానికి ఉపయోగపడే డ్రోన్ల తయారీ కోసం డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందులు పంపిస్తున్నామని వివరించారు. సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ రంగం, మారిటైమ్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లోనూ పెట్టుబడులను ప్రోత్సహిస్తామని తెలిపారు. తిరుపతిని గ్లోబల్ సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే విషయంలో వేగమే తమ ప్రభుత్వ విధానమని సీఎం స్పష్టం చేశారు. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ద్వారా పారిశ్రామికవేత్తలకు త్వరితగతిన అనుమతులు అందిస్తున్నామని చెప్పారు. కియా కార్ల పరిశ్రమ ఏపీ విధానానికి మంచి ఉదాహరణగా నిలుస్తోందన్నారు. ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు కేవలం 36 రోజుల్లోనే అనుమతులు ఇచ్చి భూమి కేటాయించామని, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ కూడా 19 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమైందని వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్, హార్టికల్చర్ రంగాల్లోనూ పెట్టుబడులు ఆకర్షించి ఏపీని ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలో 25 సెక్టోరల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాల ద్వారా అందించే విధానం ప్రారంభిస్తున్నామని, పెట్టుబడిదారులకు మరింత భరోసా కల్పించేందుకు ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకొస్తున్నామని ప్రకటించారు. రాజకీయ మార్పుల కారణంగా పెట్టుబడిదారులు ఇబ్బందులు పడకూడదన్నదే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని వివరించారు.
మరోవైపు అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా, ఆధునిక సాంకేతికతతో కూడిన ఐకానిక్ నగరంగా నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పారిశ్రామికవేత్తలు అమరావతిని తమ రెండో నివాసంగా మార్చుకోవాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో ఆరు ఆపరేషనల్ పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వే, రోడ్డు కనెక్టివిటీ ఉండటం పెట్టుబడులకు అనుకూలమని చెప్పారు. సాగు, తాగునీటితో పాటు పరిశ్రమల అవసరాల కోసం గోదావరి జలాలను వినియోగించుకునే ప్రణాళికలు ఉన్నాయని, గోదావరి-కావేరీ అనుసంధానం ద్వారా ఐదు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యుత్ గ్రిడ్ తరహాలోనే వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనను కూడా ప్రస్తావించారు. ఏపీలో పేదల జీవన ప్రమాణాలు పెంచడం, సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతలని, యాక్సెస్ టు ఈక్వాలిటీ ఇండెక్స్‌లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని తెలిపారు.