వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

రాజకీయాలు | రచన: Kalyan |

AP Elections: ఏపీ ఎన్నికల్లో గొడవలు చేస్తే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్..!

AP Elections
ఏపీ ఎన్నికల్లో గొడవలు చేస్తే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్..! Photo: ఏపీ ఎన్నికల్లో గొడవలు చేస్తే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. హింస, బెదిరింపులు, నామినేషన్లకు అడ్డంకులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, చట్టబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో హింసకు పాల్పడినా, అభ్యర్థులను బెదిరించినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. మంగళగిరిలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఆయన సమీక్ష నిర్వహించి ఎన్నికల భద్రతపై కీలక ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేందుకు, చట్టబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనేందుకు పూర్తి రక్షణ కల్పిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద బారికేడ్లు దాటి వెళ్లడం, రహదారులను దిగ్బంధించడం, విధుల్లో ఉన్న పోలీసులపై దాడులకు పాల్పడటం వంటి చర్యలను సహించబోమన్నారు. ఎన్నికల ప్రక్రియకు అడ్డంకులు సృష్టించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే నామినేషన్ల దాఖలు సందర్భంగా వివిధ జిల్లాల్లో చోటుచేసుకున్న ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్లు డీజీపీ వెల్లడించారు. పల్నాడు, కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, మార్కాపురం జిల్లాల్లో నమోదైన ఘటనలకు సంబంధించి నిందితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఘటనలకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరినీ కేసుల్లో ఇరికించబోమని, అదే సమయంలో రాజకీయ నేపథ్యం ఉందనే కారణంతో ఎవరినీ రక్షించబోమని డీజీపీ స్పష్టం చేశారు. రాజకీయ అనుబంధాలను బట్టి పక్షపాతంగా బైండోవర్ చర్యలు ఉండవని పేర్కొన్నారు. సీసీటీవీ దృశ్యాలు, డ్రోన్ కెమెరాలు, పోలీసుల బాడీ కెమెరాల రికార్డింగ్‌లను పరిశీలించి హింసకు పాల్పడిన వారితో పాటు, దానికి ప్రేరేపించిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సున్నిత ప్రాంతాలు, నామినేషన్ కేంద్రాల వద్ద ముందస్తుగానే అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు డీజీపీ తెలిపారు. ప్రచార ర్యాలీలు, ప్రచార వాహనాలు, మైకుల వినియోగంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ నాయకులు, అభ్యర్థులు సహకరించాలని కోరారు. బెదిరింపులు లేదా ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.