Elections: ఏపీలో మరోసారి ఎన్నికల సందడి.. 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు నోటిఫికేషన్..!
ఏపీలో పెండింగ్‌లో ఉన్న నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల సందడి మొదలుకానుంది. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి ప్రభావం కనిపించగా.. వివిధ కారణాలతో కొన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇప్పుడు వాటికి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందులో భాగంగా నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునే గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాజకీయ సందడి మొదలుకానుంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 17వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా.. 19వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఇక ఈనెల 26న పోలింగ్ నిర్వహించనుండగా.. 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రచారం, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాల్లో కీలకమైన సమయం మొదలైంది.
ఇక ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్ల విషయానికి వస్తే శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి ఉన్నాయి. మున్సిపాలిటీల్లో ఆమదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట, బాపట్ల ఉన్నాయి. మొత్తంగా 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో ఏయే పార్టీలు పైచేయి సాధిస్తాయన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.