Ap Municipal Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. జగన్ అడ్డాలోనూ టీడీపీ జెండా..!
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సత్తా చాటింది. కుప్పంలో 32 వార్డులకు గాను 31 స్థానాలు గెలుచుకోగా, వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో 40 వార్డుల్లో 37 స్థానాలను కైవసం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సత్తా చాటుతోంది. ముఖ్యంగా వైసీపీకి బలమైన పట్టున్న ప్రాంతాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయాలు సాధించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, కడప వంటి కీలక ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో నిలిచారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో జనసేన కూడా తన ప్రభావాన్ని చూపించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 32 వార్డులకు గాను 31 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి రాజ్‌కుమార్ కూడా విజయం సాధించారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ కూటమి ఘన విజయం సాధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తం 40 వార్డుల్లో ఏకగ్రీవ స్థానాలతో కలిపి కూటమి 37 స్థానాలను దక్కించుకోగా.. వైసీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. టీడీపీ అభ్యర్థి గీతాకుమారి 13,875 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా విజయం సాధించారు. దీంతో పులివెందుల ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఇక గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్ల ఫలితాలు కూడా ఉత్కంఠ రేపాయి. విశాఖలో టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి విజయం సాధించడం కూటమికి కీలక పరిణామంగా నిలిచింది. విజయవాడలో జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఆధిక్యంలో కొనసాగినప్పటికీ, లెక్కింపు ప్రక్రియలో జాప్యం కారణంగా ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు చీరాల మున్సిపాలిటీలో ప్రతికూల వాతావరణం కారణంగా కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. కుప్పం నుంచి పులివెందుల వరకు కూటమి విజయాలు సాధించడం, కీలక నగరాల్లో ఆధిక్యం ప్రదర్శించడం ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ చర్చగా మారింది.
ఈ ఫలితాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఇవి ఎన్నికలు కాకుండా సెలక్షన్లుగా మారాయని ఆరోపించారు. మరోవైపు కూటమి నేతలు మాత్రం ప్రజలు తమ పాలనకు మద్దతుగా తీర్పునిచ్చారని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు రాజకీయ పార్టీల దృష్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పడింది. మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కూటమికి మరింత ఉత్సాహాన్ని ఇవ్వగా.. వైసీపీకి మాత్రం కీలక ప్రాంతాల్లో వచ్చిన ఫలితాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయి.