తోడికోడళ్ల నుంచి అక్కాచెల్లెళ్ల వరకు.. ఎన్నికల బరిలో కుటుంబ పోరు.. ఎవరు గెలిచారంటే!
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర కుటుంబ పోటీలు వెలుగులోకి వచ్చాయి. నర్సీపట్నంలో తోడికోడళ్ల పోరులో టీడీపీ అభ్యర్థి పద్మావతి 11,519 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మిగనూరు, పులివెందుల, పాలకొండల్లో భార్యాభర్తలు జంటగా విజయం సాధించగా.. ఆదోనిలో అక్కాచెల్లెళ్ల పోరులో అక్క గెలిచారు. గూడూరులో తల్లి విజయం సాధించగా కుమారుడు ఓడిపోయారు. తునిలో భార్యాభర్తలిద్దరూ పరాజయం ఓడిపోయారు.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటముల లెక్కలు తేలిపోయాయి. అయితే ఈసారి ఫలితాలు కేవలం పార్టీల బలాబలాలకే పరిమితం కాలేదు. కొన్ని చోట్ల ఒకే కుటుంబానికి చెందినవారు ప్రత్యర్థులుగా బరిలోకి దిగగా, మరికొన్ని ప్రాంతాల్లో భార్యాభర్తలు జంటగా పోటీ చేశారు. అక్కాచెల్లెళ్లు, తోడికోడళ్లు, తల్లీకుమారులు ఇలా రకరకాల కుటుంబ బంధాల మధ్య సాగిన ఈ ఎన్నికల పోరు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓట్ల లెక్కింపు తర్వాత ఎక్కడో ఒకే ఇంట్లో సంబరాలు కనిపిస్తే.. ఇంకొన్ని కుటుంబాల్లో మాత్రం ఓటమి నిరాశ మిగిలింది.
నర్సీపట్నం మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికల్లో తోడికోడళ్ల మధ్య జరిగిన పోరు అందరి దృష్టిని ఆకర్షించింది. శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడి సతీమణి, టీడీపీ అభ్యర్థి పద్మావతి.. తన తోడికోడలు, వైకాపా అభ్యర్థి అనితపై ఘన విజయం సాధించారు. ఏకంగా 11,519 ఓట్ల మెజార్టీతో పద్మావతి గెలుపొందారు. గతంలో అనిత ఛైర్‌పర్సన్‌గా, పద్మావతి కౌన్సిలర్‌గా పనిచేశారు. ఈసారి ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడగా.. ఫలితం పద్మావతికి అనుకూలంగా వచ్చింది.
మరోవైపు కొన్ని పట్టణాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఎన్నికల్లో విజయం సాధించి ప్రత్యేకంగా నిలిచారు. ఎమ్మిగనూరులో కూటమి ఛైర్పర్సన్ అభ్యర్థి మాచాని సునీతతో పాటు ఆమె భర్త ఎంబీ మహేష్‌కుమార్ గెలుపొందారు. పులివెందులలో తూగుట్ల గీతాకుమారి, ఆమె భర్త మధుసూదన్‌రెడ్డి విజయం సాధించారు. పాలకొండలో జనసేన ఛైర్పర్సన్ అభ్యర్థి పల్లా విజయనిర్మలతో పాటు ఆమె భర్త కొండలరావు కూడా కౌన్సిలర్‌గా గెలిచారు. అయితే ఆదోనిలో పోటీ చేసిన వైకాపా దంపతుల్లో భర్త విజయం సాధించగా.. భార్యకు ఓటమి ఎదురైంది.
కుటుంబ సభ్యుల మధ్య జరిగిన మరో ఆసక్తికర పోరు ఆదోనిలో కనిపించింది. 52వ వార్డు నుంచి అక్కాచెల్లెళ్లు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. వైకాపా తరఫున పోటీ చేసిన అక్క ఇందు విజయం సాధించగా.. తెదేపా అభ్యర్థిగా నిలిచిన చెల్లెలు ఉష ఓటమి పాలయ్యారు. గూడూరు నగర పంచాయతీలోనూ తల్లీకుమారుల మధ్య ఫలితాలు భిన్నంగా వచ్చాయి. భాజపా తరఫున ఛైర్‌పర్సన్‌గా పోటీ చేసిన తల్లి డమాం సునీత గెలుపొందగా.. కౌన్సిలర్‌గా బరిలోకి దిగిన కుమారుడు అక్షయ్ ఓడిపోయారు. తునిలో మాత్రం వైకాపా తరఫున వేర్వేరు వార్డుల్లో పోటీ చేసిన భార్యాభర్తలు కొప్పర్తి శ్రీలక్ష్మి, మూర్తి ఇద్దరూ పరాజయం పాలయ్యారు. ఇలా ఏపీ మున్సిపల్ ఎన్నికలు కొన్ని కుటుంబాల్లో డబుల్ విక్టరీని అందించగా.. మరికొన్ని ఇళ్లలో చేదు అనుభవాన్ని మిగిల్చాయి.