Municipal Elections: ఏపీలో పురపోరు ప్రచారం ముగిసింది.. 36 వేల మంది పోలీసులతో భారీ భద్రత.. ఓటింగ్ ఎప్పుడంటే..?
ఏపీలో పురపాలక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగిన ప్రచారానికి నేటితో తెరపడింది. ఇక అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు నవంబర్ 1న ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు.
ఏపీలో పురపాలక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగిన ప్రచారానికి నేటితో తెరపడింది. ఇక అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు నవంబర్ 1న ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 36,351 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధుల్లో మోహరిస్తున్నారు.
సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టనున్నారు. ఇందుకోసం డ్రోన్లు, సీసీ కెమెరాలు, నిరంతర వీడియో గ్రఫీతో పాటు వెబ్‌కాస్టింగ్‌ను కూడా వినియోగించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 3న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడించనున్నారు.
మరోవైపు పోలింగ్‌కు ముందే నామినేషన్ల దశలో అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలను కూటమి ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఇందులో టీడీపీ 15 స్థానాలు గెలుచుకోగా.. జనసేన, బీజేపీ చెరో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ జిల్లాలో ఆరు పట్టణ స్థానిక సంస్థలు కూటమి ఖాతాలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
వార్డులు, డివిజన్ల స్థాయిలోనూ ఏకగ్రీవాల ప్రభావం కనిపించింది. మొత్తం వార్డు స్థానాల్లో 21 శాతానికి పైగా, డివిజన్లలో 12 శాతానికి పైగా స్థానాలు పోటీ లేకుండానే ఖరారయ్యాయి. రాష్ట్రంలోని 13 కార్పొరేషన్ల పరిధిలో ఉన్న 922 డివిజన్లలో 118 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాలతో ఇప్పటికే కూటమి ఆధిక్యం స్పష్టమైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే మిగిలిన స్థానాల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే, పోలింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సిబ్బందిని తరలించే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. మొత్తంగా ప్రచారం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పోలింగ్‌పై పడింది. ఏకగ్రీవాలతో ముందంజలో ఉన్న కూటమికి ఓటర్లు కూడా అదే స్థాయిలో మద్దతు ఇస్తారా? లేక ఫలితాల్లో కొత్త రాజకీయ సమీకరణాలు కనిపిస్తాయా? అన్నది నవంబర్ 3న తేలనుంది.