వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

రాజకీయాలు | రచన: Kalyan |

Ap Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. కూటమిలో సీట్ల పంచాయితీకి తెర.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..!

Tdp janasena bjp
ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. కూటమిలో సీట్ల పంచాయితీకి తెర.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే Photo: ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. కూటమిలో సీట్ల పంచాయితీకి తెర.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. 17 నగరపాలక సంస్థల్లో మేయర్ పీఠాల కోసం టీడీపీ 11, జనసేన 4, బీజేపీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలను ఖరారు చేశాయి. అభ్యర్థుల ఎంపిక, డివిజన్లు, వార్డుల వారీగా సీట్ల పంపకాలపై పార్టీలు దృష్టి సారించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. మేయర్, ఛైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు కూటమి పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నాలుగు రోజుల పాటు సాగిన చర్చల అనంతరం మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలపై ఒక నిర్ణయానికి వచ్చాయి. ఏ నగరపాలక సంస్థలో ఏ పార్టీ బరిలోకి దిగాలనే అంశాన్ని ఖరారు చేశాయి. గురువారం రాత్రి ఈ వివరాలను వెల్లడించడంతో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తల్లో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో టీడీపీ అత్యధిక స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన, బీజేపీకి కూడా వాటి బలాబలాలు, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్థానాలను కేటాయించారు. 17 నగరపాలక సంస్థల్లో మేయర్ పీఠాల కోసం టీడీపీ 11 చోట్ల, జనసేన నాలుగు చోట్ల, బీజేపీ రెండు చోట్ల పోటీ చేయనున్నాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ పదవుల విషయానికి వస్తే టీడీపీ 78 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో, బీజేపీ ఏడు స్థానాల్లో బరిలోకి దిగనుంది. మొత్తంగా టీడీపీ 89, జనసేన 25, బీజేపీ తొమ్మిది పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ చేయనున్నాయి. మొత్తం కేటాయింపుల్లో జనసేనకు 20.33 శాతం, బీజేపీకి 7.32 శాతం వాటా దక్కింది. సీట్ల పంపకం అంతా సాఫీగా సాగిందని భావించినా.. చర్చల ప్రారంభంలో టీడీపీ, జనసేన మధ్య కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జనసేన మరిన్ని స్థానాలను కోరగా, రాజకీయ సమీకరణాలు, స్థానిక నాయకుల బలాబలాలను పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు చేయాల్సి ఉంటుందని టీడీపీ అభిప్రాయపడింది. దీంతో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలనే అంశంపై కొంతకాలం స్పష్టత రాలేదు. అయితే ఇరు పార్టీల నాయకత్వాలు పరస్పర చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుని, చివరకు అంగీకారానికి వచ్చాయి. సోమవారం నుంచి బుధవారం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జనసేన, బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. మరోవైపు జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో టీడీపీ నేతలు కూడా చర్చలు జరిపారు. బుధవారం జరిగిన సమావేశాల్లో సీట్ల పంపకంపై ప్రాథమిక అవగాహన ఏర్పడగా.. గురువారం మరోసారి జరిగిన చర్చలతో తుది నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూనే సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నేతల అభిప్రాయాలు సీట్ల కేటాయింపుపై ప్రభావం చూపాయి. పెద్దాపురం మున్సిపాలిటీని జనసేనకు కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారంతో అక్కడ టీడీపీ శ్రేణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న జనసేన.. పెద్దాపురంలో టీడీపీ పోటీ చేసేందుకు అంగీకరించింది. మరోవైపు ఏలూరు మేయర్ స్థానంపై జనసేన ఆసక్తి చూపింది. అక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ.. పార్టీ నాయకత్వం వారితో చర్చించి జనసేనకు అవకాశం కల్పించింది. ఇలా కొన్ని చోట్ల ఒక పార్టీ వెనక్కి తగ్గగా, మరికొన్ని ప్రాంతాల్లో మరో పార్టీ సర్దుబాటు చేసుకోవడంతో పంపకాల ప్రక్రియ పూర్తయింది. ఇక మేయర్, ఛైర్‌పర్సన్ అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీలు దృష్టి సారించాయి. ఆయా పదవులకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక దాదాపు తుది దశకు చేరుకుంది. శుక్రవారం నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికను మాత్రం జిల్లాల స్థాయిలోనే పూర్తి చేసి, అక్కడే ప్రకటనలు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని డివిజన్లు, వార్డుల పంపకాలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. మూడు పార్టీల జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎవరెక్కడ పోటీ చేయాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. శుక్ర, శనివారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. కార్పొరేషన్ల వారీగా చూస్తే.. విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు నగరపాలక సంస్థల్లో టీడీపీ పోటీ చేయనుంది. శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లలో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. రాజమహేంద్రవరం, అనంతపురం నగరపాలక సంస్థల్లో బీజేపీ పోటీ చేయనుంది. సీట్ల పంపకాలు పూర్తవడంతో ఇప్పుడు మూడు పార్టీల దృష్టి అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై పడింది. స్థానికంగా ఎవరికి అవకాశం దక్కుతుంది? ఏయే వార్డుల్లో ఏ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతారు? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.