వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

Weather Alert: ఏపీకి మురసు తుఫాను ముప్పు.. ఈ జిల్లాల్లో 30 సెం.మీ. వర్షం.. సీఎం కీలక ఆదేశాలు!

Weather Alert

మురసు తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పల్నాడులో 30 సెం.మీ., ప్రకాశంలో 24 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. మురసు తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల వచ్చిన అర్నబ్ తుఫానుతో పోలిస్తే మురసు ప్రభావం తక్కువగానే ఉండొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో తుఫాను సన్నద్ధతపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మురసు తుఫాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో అత్యధికంగా 30 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రకాశం జిల్లాలో 24 సెం.మీ., మార్కాపురంలో 19 సెం.మీ., కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 9 సెం.మీ. వరకు వర్షాలు కురవొచ్చని తెలిపారు. ఏలూరు, నెల్లూరు జిల్లాల్లోనూ సుమారు 9 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా డ్రెయిన్లను ముందుగానే శుభ్రం చేయాలని, వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తుఫాను గాలుల వల్ల దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సుమారు 8 వేల విద్యుత్ స్తంభాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదనంగా చెన్నై నుంచి వెయ్యి మంది విద్యుత్ సిబ్బందిని రప్పిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరే అవకాశం ఉండటంతో నీటి నిర్వహణపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో 30 నుంచి 50 టీఎంసీల వరకు వరద ప్రవాహాలు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పులిచింతలలో ప్రస్తుతం 18 టీఎంసీల మేర ఫ్లడ్ కుషన్ అందుబాటులో ఉందని తెలిపారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సుమారు 1.5 లక్షల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని వివరించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాల్లో వర్షపాతం లోటు ఉన్నందున ఈ వర్షాలను వృథా కాకుండా చెరువులు, రిజర్వాయర్లలో నిల్వ చేయాలని చంద్రబాబు సూచించారు. కంభం చెరువుతో పాటు మధ్యతరహా, చిన్న నీటిపారుదల చెరువులను నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాను ప్రభావం ఉండే ఆరు జిల్లాల పరిధిలోని సుమారు 6,800 చెరువుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. ఎక్కడా చెరువులకు గండ్లు పడకుండా సాగునీటి సంఘాలను అప్రమత్తం చేయాలని, ప్రజల భాగస్వామ్యంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వర్షపు నీరు, వరద ప్రవాహాలను కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతరం గమనించాలని తెలిపారు. డ్రెయిన్లలో పూడిక కారణంగా పంట పొలాలు నీట మునగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జలాశయాల్లోకి వచ్చే నీటిని సక్రమంగా నిర్వహిస్తూ.. అవసరమైన చోట వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని గర్భిణులను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించగా.. ఇప్పటికే 3,066 మంది గర్భిణులను తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కచ్చా ఇళ్లలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అవసరమైన నిత్యావసర సరుకులను సిద్ధంగా ఉంచాలని, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అవసరమైన ప్రాంతాల్లో మోహరించాలని చెప్పారు. రైల్వే మార్గాలు, జాతీయ రహదారులపై వరద ముప్పు ఉన్నచోట రాకపోకలను నియంత్రించాలని, మత్స్యకారుల పడవలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక తుఫాను పరిస్థితులపై అధికారులు నిరంతరం నిఘా కొనసాగించాలని సీఎం సూచించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిస్థితిని సమీక్షించి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని, సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించాలని ఆదేశించారు. తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత పునరుద్ధరణ పనులను 48 గంటల్లో పూర్తి చేయాలని, పంట నష్టం జరిగిన రైతులకు బీమా పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. మొత్తంగా మురసు తుఫానును ఎదుర్కోవడంతో పాటు, దాని ద్వారా వచ్చే వర్షపు నీటిని భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకునేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.