Viral News: సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.1.5 కోట్లు ఇస్తా.. మరోచోట రెండు ఎకరాల భూమి!
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే సర్పంచ్ పదవుల కోసం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కోనసీమ జిల్లా బండారులంకలో ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తానని దొమ్మేటి రమేష్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో.. మొదలుకాకముందే సర్పంచ్ పదవుల కోసం ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రచారం, హామీలు, పోటీ కనిపిస్తాయి. కానీ ఈసారి కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకుంటే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామంటూ, విలువైన భూములు దానం చేస్తామంటూ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇంకోచోట మాత్రం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు లక్కీ డిప్‌ను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలంలోని బండారులంక పంచాయతీలో దొమ్మేటి రమేష్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రామస్తులంతా కలిసి ఒకరిని ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం ఏకంగా రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తానని ఆయన ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా గ్రామాన్ని ఇబ్బంది పెడుతున్న డంపింగ్ యార్డు, డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మాదరాజుగూడూరులో సర్పంచ్ పదవికి పలువురు ఆసక్తి చూపడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ వినూత్న ఆలోచనకు తెరతీశారు. ఆశావహుల మధ్య పోటీ, విభేదాలు పెరగకుండా లక్కీ డిప్ ద్వారా ఒకరిని ఎంపిక చేయాలని నిర్ణయించారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్పలోనూ ఇలాంటి భారీ ఆఫర్ వెలుగులోకి వచ్చింది. తన భార్య కొప్పర్తి రామలక్ష్మిని గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రెండు ఎకరాల భూమిని పంచాయతీకి దానం చేస్తానని గ్రామస్తుడు కొప్పర్తి శ్రీరామచంద్రమూర్తి ప్రకటించారు. ఈ భూమి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని, గ్రామంలో మంచినీటి చెరువు నిర్మాణానికి దానిని కేటాయిస్తానని తెలిపారు. గ్రామంలో చాలాకాలంగా ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో సర్పంచ్ పదవికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కొత్త రూపం దాల్చినట్లయింది.
ఒక గ్రామంలో ఏకగ్రీవ ఎన్నిక జరిగితే రూ.1.50 కోట్ల అభివృద్ధి హామీ.. మరో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎంపికకు లక్కీ డిప్.. ఇంకోచోట రెండు ఎకరాల భూమి దానం.. ఇలా పంచాయతీ ఎన్నికల వేడి మొదలుకాకముందే ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. గ్రామానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రకటనలు చేస్తున్నామని సంబంధిత వ్యక్తులు చెబుతున్నప్పటికీ, వాటి అమలు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈసారి సర్పంచ్ పదవి కోసం సాగుతున్న పోటీ సాధారణ ఎన్నికల ప్రచారానికి భిన్నంగా కొత్త చర్చకు తెరతీస్తోంది.