ఏపీ పోలీస్ ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ విడుదల.. కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల తేదీలు ఖరారు!
ఆంధ్రప్రదేశ్‌లో 1,534 పోలీస్ ఉద్యోగాల భర్తీకి SLPRB షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 27, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా, డిసెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష జనవరి 31, 2027న, ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 28న నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (SLPRB) కీలక సమాచారం అందించింది. పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), కానిస్టేబుల్‌తో పాటు ఇతర సమాన స్థాయి పోస్టుల భర్తీకి పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. మొత్తం 1,534 పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 27, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు డిసెంబర్ 16, 2026 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామకాల్లో 378 ఎస్ఐ పోస్టులు, 1,156 కానిస్టేబుల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. ఎస్ఐ పోస్టుల్లో 253 సివిల్ ఎస్ఐ ఉద్యోగాలు, 116 ఆర్మ్డ్ రిజర్వ్ (AR) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 9 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) ఎస్ఐ పోస్టులు ఉన్నాయి.
కానిస్టేబుల్ కేటగిరీలో 542 సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు, 285 ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుళ్లను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖలో 158 ఫైర్‌మెన్ పోస్టులు, జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగంలో 150 పురుష వార్డర్లు, 21 మహిళా వార్డర్ పోస్టులు ఉన్నాయి.
కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల తేదీలు ఇవే: నియామక మండలి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష 2027 జనవరి 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 28న జరగనుంది. ఎస్ఐ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.
అర్హతలు, వయోపరిమితి, విద్యార్హతలు, పరీక్షా సిలబస్, దరఖాస్తు ఫీజు తదితర వివరాలను సంబంధిత నోటిఫికేషన్‌లో పూర్తిగా పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేయాలని నియామక మండలి సూచించింది. దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ slprb.ap.gov.in ద్వారా మాత్రమే సమర్పించాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత ఫైనల్ అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి. ఇతర సాంకేతిక సందేహాల కోసం వెబ్‌సైట్‌లో ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.
SI (PTO, కమ్యూనికేషన్), FSL సైంటిఫిక్ అసిస్టెంట్లు, కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లు, డ్రైవర్, మెకానిక్, డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు తేదీలు, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.