AP Elections: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాతకం ఇక ఆన్‌లైన్‌లోనే.. ఎస్‌ఈసీ కీలక నిర్ణయం..!
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వారు సమర్పించిన నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లలో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే త్వరలోనే ఈ వివరాలను ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం కలగనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వారు సమర్పించిన నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లలో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే త్వరలోనే ఈ వివరాలను ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం కలగనుంది. అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని కోరుతూ ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన శివకార్తీక్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండాలని, ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వెబ్‌సైట్‌లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. అభ్యర్థుల నామినేషన్లు, అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేందుకు అంగీకరించింది.
ఈ నిర్ణయంతో అభ్యర్థుల పూర్తి వివరాలను తెలుసుకోవడం ప్రజలకు మరింత సులభం కానుంది. ముఖ్యంగా అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయా? వారి ఆస్తులు, అప్పుల వివరాలు ఏమిటి? విద్యార్హతలు ఎంత? వంటి అంశాలను అఫిడవిట్ల ద్వారా పరిశీలించే అవకాశం ఉంటుంది. అయితే ఈ వివరాలను వెబ్‌సైట్‌లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంచుతారు, ఏ విధానంలో ప్రజలు వాటిని పరిశీలించవచ్చనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంచడంతో పాటు ఓటర్లు అభ్యర్థుల గురించి పూర్తి సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకోవడానికి ఈ చర్య ఉపయోగపడనుంది.