వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

Weather: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారనుందా..?

Weather Alert

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం మారనుంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో గంటకు 40–50 కి.మీ., రాయలసీమలో 30–40 కి.మీ. వేగంతో గాలులు వీచే సూచనలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం మారనుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముండగా, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర అంతర్గత ఒడిశాపై కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, పరిసర ప్రాంతాలకు విస్తరించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన వెలువడింది. ఏపీ కోస్తా ప్రాంతం, యానాంలో శని, ఆదివారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని అంచనా వేస్తున్నారు. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో వర్షం సమయంలో బయటకు వెళ్లే వారు, ప్రయాణాలు చేసేవారు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. రాయలసీమలోనూ వాతావరణం ఇదే తరహాలో మారే అవకాశముంది. శని, ఆదివారాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ మెరుపులు సంభవించే అవకాశం ఉండటంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఒక్కసారిగా వర్షం పడే సమయంలో గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక తెలంగాణలోనూ అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం కనిపించనుంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని తెలిపింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది? ఎక్కడ వర్షాలు కురుస్తాయి? గాలుల ప్రభావం ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది? అన్నది ప్రజలు గమనిస్తూ ఉండాలి.