వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

Cyclone Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 26 నాటికి తుఫానుగా మారే ఛాన్స్.. ఏపీకి వర్ష సూచన..!

Cyclone Alert
బంగాళాఖాతంలో అల్పపీడనం.. 26 నాటికి తుఫానుగా మారే ఛాన్స్.. ఏపీకి వర్ష సూచన..! Photo: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 26 నాటికి తుఫానుగా మారే ఛాన్స్.. ఏపీకి వర్ష సూచన..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 26 నాటికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం రానున్న రోజుల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ తీర ప్రాంతాల ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అక్టోబర్ 23 ఉదయం ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 25 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం అక్టోబర్ 26 ఉదయం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారవచ్చని అంచనా. ఆ తర్వాత ఉత్తర ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాల దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వ్యవస్థ ప్రభావంతో కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని అంచనా. రేపు, ఎల్లుండి కూడా కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ ఈరోజు నుంచి మరో మూడు రోజుల పాటు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తుఫాను దిశ, తీవ్రతపై వచ్చే అధికారిక వాతావరణ బులెటిన్లను ప్రజలు గమనించాలి.