ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌పై కీలక ప్రకటన.. ఆ 3 మండలాలకు బ్రేక్..!
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 5న యథావిధిగా జరగనుంది. తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో మాత్రం ఎన్నికలు వాయిదా పడ్డాయి. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గత రెండు రోజులుగా కోస్తా జిల్లాలను వణికించిన మురసు తుపాను ప్రభావంతో పోలింగ్ వాయిదా పడుతుందంటూ జరిగిన ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఫుల్స్టాప్ పెట్టింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే (నవంబర్ 5, గురువారం) రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న గుంటూరు జిల్లాలోని మూడు మండలాలకు మాత్రం ఎన్నికల నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చింది.
గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం నవంబర్ 7వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో తాజా పరిస్థితులు, వరద ప్రభావం, పోలింగ్ ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెజారిటీ ప్రాంతాల్లో వరద తీవ్రత తగ్గిందని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు నివేదించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించేందుకు ఎలాంటి ఆటంకం లేదని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది పోటీలో ఉండగా, 7,767 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవితవ్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా 2,61,52,377 మంది ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో 1,28,76,887 మంది పురుషులు, 1,32,74,208 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో 9,966 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా, 9,186 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఏకంగా 38 వేల మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. మరోవైపు 35,333 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1.41 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.
అయితే గుంటూరు జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మురసు తుపాను ప్రభావంతో వరద నీరు చేరడం, పోలింగ్ సామగ్రిని తరలించడం కూడా సాధ్యం కాకపోవడంతో పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో రేపు పోలింగ్ యథావిధిగా జరగనుండగా, ఈ మూడు మండలాల ఓటర్లు మాత్రం తదుపరి ఎన్నికల తేదీ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.