బండ్ల గణేశ్‌కు మరోసారి న్యాయపరమైన చిక్కులు.. చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష!
చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు సెషన్స్ కోర్టు ఆయన అప్పీల్‌ను కొట్టివేస్తూ ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానాతో కూడిన కింది కోర్టు తీర్పును సమర్థించింది. నాలుగు వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌కు చెక్ బౌన్స్ కేసులో కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. రూ.95 లక్షల ఆర్థిక లావాదేవీకి సంబంధించిన ఈ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదుదారుడికి జరిగిన న్యాయపరమైన ఖర్చులను కూడా భరించాలని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో గతంలోనూ కోర్టు ఆయనకు శిక్ష విధించింది. 2024 ఫిబ్రవరి 14న ఒంగోలులోని రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు బండ్ల గణేశ్‌కు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.95.10 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తంలో రూ.95 లక్షలను ఫిర్యాదుదారుడికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన పైకోర్టును ఆశ్రయించారు.
తాజాగా నవంబర్ 18న ఒంగోలులోని రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఆయన క్రిమినల్ అప్పీల్‌ను కొట్టివేసి, కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నాలుగు వారాల్లోగా ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని బండ్ల గణేశ్‌ను ఆదేశించింది. గడువులోగా లొంగిపోకపోతే ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఈ తీర్పుపై స్పందించిన బండ్ల గణేశ్.. భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయం కోరేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. చట్టంపై పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతానని వెల్లడించారు.
సినిమా రంగంలో నటుడిగా, నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేశ్‌కు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. గతంలోనూ ఆయనపై చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి. తాజా కోర్టు తీర్పుతో ఆయన తదుపరి న్యాయపరమైన చర్యలపై ఆసక్తి నెలకొంది.