Bhupalpally: భర్తను చంపి.. ఎడ్లబండిపై మృతదేహాన్ని తరలింపు.. భార్య, ప్రియుడి దారుణం..!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గొల్లబుద్ధారం గ్రామ తండాలో అజ్మీర చందు హత్యకు గురయ్యాడు. భార్య పావని, ఆమె ప్రియుడు సంతోష్ కలిసి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యే భర్త పాలిట కాలయముడిగా మారిందనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. హత్య అనంతరం మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామ తండాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర చందు అనే వ్యక్తిని అతడి భార్య పావని, ఆమె ప్రియుడు సంతోష్ కలిసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఇంట్లోనే చందును హత్య చేసిన అనంతరం.. మృతదేహాన్ని ఎడ్లబండిపై తీసుకెళ్లి చికెన్‌పల్లి సమీపంలోని రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని గమనించిన స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ సంపత్ రావు, సీఐలు అక్కడి పరిస్థితులను పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పావని, సంతోష్ ఘటన అనంతరం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. భూపాలపల్లి సీఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పట్టుబడితే హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.