మళ్లీ రూ.500 నోట్లు రద్దు కానున్నాయా? చంద్రబాబు వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చ!
రూ.500 నోట్లను రద్దు చేసి, రూ.100, రూ.200 నోట్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అయితే రూ.500 నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్బీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో మరోసారి నోట్ల రద్దు అంశంపై చర్చ మొదలైంది.
రూ.500 నోట్లు మరోసారి రద్దు కానున్నాయా? ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న రూ.500 కరెన్సీ నోట్లపై తాజాగా చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై ఆసక్తిని పెంచాయి. అవినీతి, నల్లధనం, నకిలీ కరెన్సీ వంటి సమస్యలను అరికట్టేందుకు రూ.500 నోట్లను రద్దు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతున్నట్లు తెలిపారు.
రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలా?
ప్రస్తుతం నగదు లావాదేవీల్లో రూ.500 నోట్లు విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. అయితే పెద్ద నోట్ల వల్ల అక్రమ నగదు లావాదేవీలకు అవకాశం ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. రూ.100, రూ.200 నోట్లు మాత్రమే అందుబాటులో ఉండేలా చూడాలని, డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అవినీతిని నియంత్రించడంలో డిజిటల్ చెల్లింపులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై స్పందించేందుకు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటే సంపద సృష్టికి అవకాశాలు పెరుగుతాయని, పేదరిక నిర్మూలన కూడా సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
నిజంగానే రూ.500 నోట్లు రద్దవుతాయా?
అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా భావించకూడదు. ప్రస్తుతం రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో కూడా 2026 మార్చి నుంచి ఏటీఎంలలో రూ.500 నోట్ల పంపిణీ నిలిపివేస్తారంటూ ప్రచారం జరగగా, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ దాన్ని తప్పుడు సమాచారంగా ఖండించింది. రూ.500 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.
2016లో జరిగిన నోట్ల రద్దు గుర్తుందా?
2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం అప్పటివరకు చలామణిలో ఉన్న పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. అనంతరం కొత్త డిజైన్తో రూ.500 నోటును ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో మరోసారి నోట్ల రద్దు అంశం చర్చకు వచ్చింది. అయితే రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం నుంచి అధికారిక నిర్ణయం వెలువడే వరకు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మే ముందు అధికారిక ప్రకటనలను పరిశీలించడం మంచిది.