వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వార్తలు | రచన: Kalyan |

చికెన్ ధరలు భారీగా పతనం.. కిలో రూ.300 నుంచి రూ.250కి.. మళ్లీ పెరిగేది అప్పుడేనా?

chicken

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా తగ్గాయి. కార్తీక మాసం ప్రభావంతో మాంసాహారానికి డిమాండ్ పడిపోవడంతో చికెన్ ధరలు కిలోపై రూ.50 వరకు దిగివచ్చాయి. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ రూ.252గా, విజయవాడలో రూ.249గా కొనసాగుతోంది. వచ్చే నెలలో కార్తీక మాసం ముగియడంతో పాటు క్రిస్మస్ పండుగ నేపథ్యంలో చికెన్ ధరలు మళ్లీ పెరిగే అవకాశముందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

చికెన్ కొనాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి నుంచి ఇప్పుడు నాన్‌వెజ్ ప్రియులకు కాస్త ఊరట లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇటీవల కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.300 దాటగా.. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రూ.250 లోపే అందుబాటులోకి వచ్చింది. కిలోపై సుమారు రూ.50 వరకు తగ్గడంతో చికెన్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు కోడిగుడ్ల ధరలు కూడా దిగిరావడం మార్కెట్‌లో మరో ఆసక్తికర పరిణామంగా మారింది. ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణం కార్తీక మాస ప్రభావమేనని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది భక్తులు అయ్యప్ప, శివమాల దీక్షలు చేపట్టడంతో పాటు కార్తీక మాస పూజలు చేస్తున్నారు. ఈ సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండేవారి సంఖ్య పెరగడంతో చికెన్ కొనుగోళ్లు తగ్గాయి. దీంతో మార్కెట్‌లో డిమాండ్ పడిపోయి, సరఫరా ఎక్కువగా ఉండటంతో ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.252, డ్రెస్డ్ చికెన్ రూ.223గా ఉంది. రిటైల్ లైవ్ బర్డ్ ధర రూ.144 కాగా, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ ధర రూ.117గా కొనసాగుతోంది. ఇక 12 కోడిగుడ్ల ధర రూ.74కు చేరింది. గతంలో ఇదే డజన్ గుడ్లు రూ.90 వరకు పలికాయి. విజయవాడ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు కిలో చికెన్ రూ.300 వరకు విక్రయించగా.. ప్రస్తుతం స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.249కు తగ్గింది. డ్రెస్డ్ చికెన్ రూ.220గా ఉంది. రిటైల్ లైవ్ బర్డ్ ధర రూ.142 కాగా, ఫారం దగ్గర లైవ్ బర్డ్ ధర రూ.115కు చేరింది. ఇక 12 కోడిగుడ్ల డజన్ ధర రూ.80గా నమోదవుతోంది. దీంతో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో చికెన్ కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభించినట్లయింది. అయితే ప్రాంతాన్ని బట్టి, చికెన్ షాపులను బట్టి రిటైల్ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ తక్కువ ధరలు వచ్చే నెలలో కొనసాగుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్‌లో కార్తీక మాసం ముగియనుండటంతో మళ్లీ మాంసాహార వినియోగం పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు క్రిస్మస్ పండుగ కూడా ఉండటంతో చికెన్‌కు డిమాండ్ పెరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కొనుగోళ్లు పెరిగితే ధరలు కూడా మళ్లీ పైకి వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. అంటే ప్రస్తుతం తగ్గిన ధరలతో చికెన్ ప్రియులు ఊరట పొందుతున్నా.. వచ్చే నెలలో మార్కెట్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.