Chicken: చికెన్ ప్రియులకు పండగే.. భారీగా తగ్గిన ధరలు.. కానీ త్వరలోనే షాక్ తప్పదా..?
కార్తీక మాసం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, కరీంనగర్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.222 నుంచి రూ.240 మధ్య విక్రయిస్తున్నారు. అయితే క్రిస్మస్ డిమాండ్, కోళ్ల దాణా ఖర్చులు పెరిగితే రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మళ్లీ పెరిగి రూ.400 వరకు చేరవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కొద్ది రోజుల క్రితం వరకు పెరిగిన ధరలతో ఇబ్బంది పడిన మాంసం ప్రియులకు ఇప్పుడు కాస్త ఊరట లభిస్తోంది. కార్తీక మాసం కారణంగా నాన్‌వెజ్ వినియోగం తగ్గడం, ప్రస్తుతం పెద్దగా పండుగలు లేకపోవడంతో చికెన్‌కు డిమాండ్ పడిపోయింది. అదే సమయంలో కోళ్ల ఫారాల నుంచి సరఫరా కొనసాగుతుండటంతో మార్కెట్లో చికెన్ ధరలు దిగివస్తున్నాయి. దీంతో ప్రస్తుతం చికెన్ కొనాలనుకునే వారికి గతంతో పోలిస్తే తక్కువ ధరలకే లభిస్తోంది.
దసరా, దీపావళి పండుగల సమయంలో చికెన్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ధరలు సైతం పెరిగాయి. అయితే పండుగలు ముగియడం, కార్తీక మాసం ప్రారంభం కావడంతో పరిస్థితి మారిపోయింది. ఈ మాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉండటంతో చికెన్ విక్రయాలు తగ్గుతున్నాయి. ఫామ్స్ నుంచి కోళ్ల సరఫరా మాత్రం తగ్గకపోవడంతో డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం ఏర్పడి ధరలు పడిపోతున్నాయి. ఈ నెలలో చికెన్ ధరలు ఇదే స్థాయిలో ఉండొచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.226 నుంచి రూ.240 మధ్య కొనసాగుతోంది. డ్రెస్డ్ చికెన్ రూ.200 వద్ద విక్రయిస్తుండగా, రిటైల్ లైవ్ బర్డ్ ధర రూ.129, ఫామ్ వద్ద లైవ్ బర్డ్ ధర రూ.102గా ఉంది. విజయవాడ జోన్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.222 నుంచి రూ.230 వరకు పలుకుతోంది. డ్రెస్డ్ చికెన్ ధర రూ.197గా ఉండగా, రిటైల్ లైవ్ బర్డ్ రూ.127, ఫామ్ వద్ద లైవ్ బర్డ్ రూ.100 వద్ద విక్రయిస్తున్నారు. కరీంనగర్‌లో స్కిన్‌లెస్ చికెన్ రూ.226, డ్రెస్డ్ చికెన్ రూ.200, రిటైల్ లైవ్ బర్డ్ రూ.129, ఫామ్ వద్ద లైవ్ బర్డ్ రూ.102గా కొనసాగుతోంది.
చికెన్ ధరలు తగ్గుతున్నప్పటికీ కోడిగుడ్ల ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ప్రస్తుతం 12 గుడ్ల రిటైల్ ధర కరీంనగర్‌లో రూ.86కు చేరగా, హైదరాబాద్‌లో రూ.84, విజయవాడలో రూ.80 వద్ద కొనసాగుతోంది. చికెన్ చౌకగా లభిస్తున్న సమయంలో గుడ్ల ధరలు పెరుగుతుండటం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే చికెన్ ధరలు ప్రస్తుతం తగ్గినా.. రాబోయే రోజుల్లో మళ్లీ పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే నెలలో క్రిస్మస్ పండుగ ఉండటంతో చికెన్‌కు డిమాండ్ పెరగొచ్చని భావిస్తున్నారు. పండుగకు ముందు కొనుగోళ్లు ఊపందుకుంటే ధరలు కూడా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే కోళ్ల దాణా ధరలు, నిర్వహణ ఖర్చులు, రవాణా వ్యయాలు పెరిగి పౌల్ట్రీ రంగంపై భారం పడవచ్చని చెబుతున్నారు.
ఈ ఖర్చులు పెరిగి చికెన్ సరఫరా, ధరలపై ప్రభావం చూపితే భవిష్యత్తులో కిలో చికెన్ రూ.400 వరకు చేరే అవకాశం ఉందని కొందరు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ధర ఇప్పుడే పెరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేం. పండుగ డిమాండ్, దాణా ధరలు, సరఫరా పరిస్థితులను బట్టి చికెన్ ధరల్లో మార్పులు ఉండొచ్చు. ప్రస్తుతానికి ధరలు తగ్గడంతో మాంసం ప్రియులకు ఊరట లభించినా, రాబోయే నెలల్లో మార్కెట్ ఎలా మారుతుందో చూడాలి.