Covid Update: మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచ దేశాల్లో కొత్త వేరియంట్.. లక్షణాలు ఇవే..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ PJ.2.1 చర్చనీయాంశంగా మారింది. తొలిసారిగా కెనడాలో గుర్తించిన ఈ వేరియంట్ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లోనూ బయటపడింది. స్పైక్ ప్రోటీన్‌లో జన్యు మార్పులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
కరోనా మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఇంతలోనే వైరస్‌లో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. PJ.2.1 పేరుతో గుర్తించిన ఈ వేరియంట్ తొలిసారిగా 2026 మే నెలలో కెనడాలో బయటపడింది. ఆ తర్వాత అమెరికాతో పాటు యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాల్లోనూ దీని ఆనవాళ్లు గుర్తించారు. ముఖ్యంగా ఈ వేరియంట్‌లోని స్పైక్ ప్రోటీన్‌లో అనేక జన్యు మార్పులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ కొత్త వేరియంట్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక అధ్యయనాల ప్రకారం, స్పైక్ ప్రోటీన్‌లో వచ్చిన మార్పులు వైరస్‌పై గతంలో ఏర్పడిన రోగనిరోధక శక్తి ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఇది ఇతర వేరియంట్ల కంటే తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. ఈ వేరియంట్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి సాధారణ ఫ్లూ లక్షణాలను పోలి ఉండటంతో అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండటం, రద్దీ ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలి. అయితే కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉండటం, ఆరోగ్య నిపుణుల సూచనలు పాటించడమే ముఖ్యం.