వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

తెలంగాణ | రచన: Kalyan |

Cyclone : బంగాళాఖాతంలో బలపడుతున్న తుపాను.. ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..!

Cyclone
బంగాళాఖాతంలో బలపడుతున్న తుపాను.. ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..! Photo: బంగాళాఖాతంలో బలపడుతున్న తుపాను.. ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం అక్టోబర్ 26 నాటికి తుపానుగా, 27న తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల వైపు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. అక్టోబర్ 25 ఉదయం నాటికి ఈ వ్యవస్థ విశాఖపట్నానికి 880 కిలోమీటర్లు, కాకినాడకు 980 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,080 కిలోమీటర్లు, బాపట్లకు 1,150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గంటకు సుమారు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు IMD వెల్లడించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఆదివారం ఈ వ్యవస్థ మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారవచ్చు. అక్టోబర్ 26 ఉదయానికి తుపానుగా, 27వ తేదీ నాటికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత అతి తీవ్ర తుపానుగా మారి ఏపీ తీరానికి చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను తీవ్రత పెరిగే కొద్దీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 28 ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరాన్ని తుపాను దాటే అవకాశం ఉందని ప్రస్తుత అంచనాలు చెబుతున్నాయి. ఆ సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో నిరంతర గాలులు వీచే అవకాశం ఉండగా, గాలి వేగం అప్పుడప్పుడు 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చని IMD హెచ్చరించింది. తీరం దాటే ఖచ్చితమైన ప్రాంతం, సమయం మారే అవకాశం ఉండటంతో ప్రజలు తాజా వాతావరణ సమాచారాన్ని గమనించాలి. మరోవైపు అక్టోబర్ 27, 28 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు. బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద, బలహీనమైన నిర్మాణాల దగ్గర ఉండకూడదు. అధికార యంత్రాంగం జారీ చేసే హెచ్చరికలు, తరలింపు సూచనలు ఉంటే వాటిని తప్పనిసరిగా పాటించాలి.