ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. నవంబర్ 20న తీరం దాటే అవకాశం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను నవంబర్ 20న నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 120–130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. తుపాను ప్రభావంతో నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరంవైపు దూసుకొస్తోంది. ఈ తుపాను ఈ నెల 20న (శుక్రవారం) మధ్యాహ్నం నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. తీరం దాటే సమయానికి ఇది అతి తీవ్ర తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సోమవారం సాయంత్రం నాటికి అక్వాన్ తుపాను బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా, నవంబర్ 19 నాటికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
పలు జిల్లాలకు రెడ్ అలర్ట్: అక్వాన్ తుపాను ప్రభావంతో నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలతో పాటు యానాంలో అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
మత్స్యకారులు ఈ నెల 20 వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. తీరప్రాంత ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను కదలికలు, తీవ్రతను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.