Train Cancelled: ఏపీలో 53 రైళ్లు రద్దు.. ఈ తేదీల్లో ప్రయాణించే వారు జాగ్రత్త..!
ఆంధ్రప్రదేశ్‌లో తుపాన్ ప్రభావం రైలు ప్రయాణాలపై పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాన్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సౌత్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27, 28 తేదీల్లో నడవాల్సిన 53 రైలు సర్వీసులను రద్దు చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాన్ ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాన్‌ను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్లను విడుదల చేసింది. మరోవైపు తుపాన్ ప్రభావం రైలు ప్రయాణాలపైనా పడింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సౌత్ కోస్ట్ రైల్వే అక్టోబర్ 27, 28 తేదీల్లో నడవాల్సిన 53 రైలు సర్వీసులను రద్దు చేసింది. కొన్ని సర్వీసుల రాకపోకల్లోనూ మార్పులు చేసింది.
రద్దైన రైళ్లలో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం, నిడదవోలు, నరసాపురం, గుంటూరు, తెనాలి, రేపల్లె, కాకినాడ పోర్ట్ మధ్య నడిచే పలు ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. విజయవాడ–మచిలీపట్నం మార్గంలో 67263, 67265, 67267, 67269, 67270 వంటి సర్వీసులు, మచిలీపట్నం–గుడివాడ మార్గంలో 67252, 67253, 67254, 67255, 67271, 67272 రైళ్లు రద్దైన జాబితాలో ఉన్నాయి.
అలాగే విజయవాడ–నరసాపురం మార్గంలో 67257, 67258, 17269, 17270 రైళ్లు, విజయవాడ–భీమవరం మార్గంలో 67275, 67284 సర్వీసులు, భీమవరం–నిడదవోలు మార్గంలో 67277, 67278, 67282, 67283 రైళ్లు ప్రభావితమయ్యాయి. నరసాపురం–రాజమండ్రి, నరసాపురం–నిడదవోలు, గుంటూరు–విజయవాడ, గుంటూరు–రేపల్లె, రేపల్లె–తెనాలి, తెనాలి–విజయవాడ మార్గాల్లోనూ పలు సర్వీసులను రద్దు చేసినట్లు జాబితాలో పేర్కొన్నారు.
తీర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లలోనూ మార్పులు ఉన్నాయి. విశాఖపట్నం–రాజమండ్రి మార్గంలోని 67286, రాజమండ్రి–విశాఖపట్నం మార్గంలోని 67285, కాకినాడ పోర్ట్–విశాఖపట్నం మార్గంలోని 17267, 17268, పార్వతీపురం–విశాఖపట్నం మార్గంలోని 07267, 07268 సర్వీసులు రద్దు జాబితాలో ఉన్నాయి. పలాస–విశాఖపట్నం, రాజమండ్రి–కాకినాడ పోర్ట్ మార్గాల్లోని కొన్ని రైళ్లపైనా ప్రభావం పడింది.
ఇక విశాఖపట్నం–కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ (18515), కిరండూల్–విశాఖపట్నం నైట్ ఎక్స్‌ప్రెస్ (18516) రైళ్లను అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 వరకు రద్దు చేసినట్లు అందిన వివరాల్లో ఉంది. విశాఖపట్నం–కోరాపుట్, కోరాపుట్–విశాఖపట్నం ప్యాసింజర్ సర్వీసులతో పాటు ఇంటర్సిటీ రైళ్ల రాకపోకలపైనా మార్పులు ప్రకటించారు. భువనేశ్వర్–జగదల్పూర్, జగదల్పూర్–భువనేశ్వర్ హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌ల విషయంలోనూ ప్రయాణికులు తాజా సమాచారం తెలుసుకోవాలి.
రైల్వే అధికారులు ప్రయాణికులకు కీలక సూచన చేశారు. రైలు రద్దయిందా, పాక్షికంగా రద్దయిందా, బోర్డింగ్ లేదా గమ్యస్థాన స్టేషన్ మారిందా అనే విషయాలను ముందుగానే తెలుసుకోవాలని కోరారు. స్టేషన్‌కు బయల్దేరే ముందు అధికారిక రైల్వే వెబ్సైట్ లేదా ఎంక్వైరీ సేవల ద్వారా రైలు స్థితిని నిర్ధారించుకుని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. తుపాన్ పరిస్థితుల నేపథ్యంలో రైళ్ల రాకపోకల్లో మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉన్నందున తాజా ప్రకటనలను గమనించడం అవసరం.