Cyclone: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నాబ్ తుఫాన్.. రేపు ఉదయం తీరం దాటే అవకాశం..!
బంగాళాఖాతంలో బలపడిన అర్నాబ్ తుఫాను అక్టోబర్ 28 ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నాబ్’ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరంవైపు దూసుకొస్తోంది. ఈ తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబర్ 28 ఉదయం బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తీరప్రాంత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలుల వేగం అప్పుడప్పుడు గంటకు 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చని అంచనా వేసింది. ఈ ప్రభావంతో తీరప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా కాకినాడ జిల్లా, యానాం పరిసరాల్లో సముద్రపు అలల ఉద్ధృతి పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను తీరం దాటే సమయంలో సాధారణ సముద్ర మట్టానికి అదనంగా సుమారు ఒకటి నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు సముద్రపు నీరు ఎగసిపడి లోతట్టు తీరప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో సముద్రానికి సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరం.
తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అవసరమైన చోట్ల సహాయక బృందాలను సిద్ధంగా ఉంచడంతో పాటు, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెల్లడించింది. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత శాఖలు సమన్వయంతో స్పందించాలని సూచించారు. అక్టోబర్ 26 నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
అర్నాబ్ తుఫాను నేపథ్యంలో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం సహా తీరప్రాంతాల ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలి. అధికారులు సూచిస్తే లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. సముద్రతీరాలు, నదులు, వాగులు, ఉద్ధృతంగా ప్రవహించే నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ధ్రువీకరించని సమాచారాన్ని నమ్మకుండా వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగం విడుదల చేసే తాజా హెచ్చరికలను అనుసరించాలి.