ఏపీపై అర్నాబ్ తుఫాన్ పంజా.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలు అప్రమత్తం!
అర్నాబ్ తుఫాన్ ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరప్రాంత జిల్లాల ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు, వరదల ప్రమాదం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చడంతో ఆంధ్రప్రదేశ్‌లో తీరప్రాంత జిల్లాలకు ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాన్ పరిస్థితులు, ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎం హెచ్చరించారు. కోనసీమ, కాకినాడ, అనకాపల్లి సహా తీరప్రాంత జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం తుఫాన్ అక్టోబర్ 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.
తుఫాన్ తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. సముద్ర తీర గ్రామాలు, లంకలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, తుఫాన్ షెల్టర్లకు వెళ్లాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు కూలిపోయే ప్రమాదం ఉందని, వరద నీటి ప్రవాహాల వైపు వెళ్లవద్దని హెచ్చరించారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 290 తుఫాన్ షెల్టర్లను ఏర్పాటు చేసి, 84,396 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ పనిచేస్తున్నాయని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, నౌకాదళం, కోస్ట్‌గార్డ్ బృందాలను అప్రమత్తం చేసినట్లు వివరించారు.
వైద్య సేవలకు 1,316 అంబులెన్సులను సిద్ధం చేయడంతోపాటు, సుమారు 5 వేల మంది గర్భిణులను సమీప ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులకు తరలించినట్లు సీఎం తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు 8,400 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. భారీ వర్షాలతో నాగావళి, వంశధార నదులకు వరద వచ్చే అవకాశం ఉండటంతో పాటు, వాగులు, వంకలు పొంగిపొర్లే పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాలకు ఆహారం, ఔషధాలు చేరవేసేందుకు డ్రోన్లను వినియోగించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
తుఫాన్ కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పంటలను కాపాడటంతోపాటు, నష్టం జరిగిన ప్రాంతాల్లో త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, బాలింతలకు అవసరమైన సరుకులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అధికారుల సూచనలు పాటించాలని, తీరప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు.