సైక్లోన్ అర్ణబ్ ఎఫెక్ట్.. స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు..
సైక్లోన్ అర్ణబ్ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27 నుంచి 29 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ అర్ణబ్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. తుఫాన్ క్రమంగా బలపడుతూ ఏపీ తీరంవైపు కదులుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
అనకాపల్లి జిల్లాలో అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో విద్యాసంస్థలు మూసివేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు ఇతర విద్యాసంస్థలకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం, రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సైక్లోన్ అర్ణబ్ ప్రభావం అక్టోబర్ 27 నుంచి మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. అక్టోబర్ 28న అనకాపల్లి సహా ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అనవసర ప్రయాణాలను తగ్గించుకోవడం, అత్యవసరమైతే మాత్రమే బయటకు వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.
అర్ణబ్ తుఫాన్ అక్టోబర్ 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య ఏపీ తీరాన్ని దాటే అవకాశం ఉందని తాజా అంచనాలు చెబుతున్నాయి. తుఫాన్ సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వరకు గాలుల వేగం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టింది. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు సెలవులపై పాఠశాలలు, జిల్లా అధికారుల నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. తుపాను తీవ్రతను బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.