వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

కౌంటింగ్‌కు ముందే గుండెపోటుతో మృతి.. తీరా ఫలితాల్లో ఘన విజయం సాధించిన మహిళ!

deceased-janasena

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం ఎంపీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి గారపాటి దివ్య (28) గుండెపోటుతో కన్నుమూశారు. కౌంటింగ్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందే ఆమె మృతి చెందగా, ఫలితాల్లో వైసీపీ అభ్యర్థిపై 352 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఐదేళ్లు, మూడు నెలల వయసున్న ఇద్దరు కుమారులను వదిలి ఆమె కన్నుమూయడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

ఎన్నికల్లో గెలవాలని పోటీ చేసిన అభ్యర్థి.. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలోనే కన్నుమూశారు. తీరా ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఆమెకే విజయం వరించింది. కానీ ఆ గెలుపు ఆనందాన్ని ఆస్వాదించడానికి మాత్రం ఆమె ఈ లోకంలో లేరు. తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ తరఫున గారపాటి దివ్య (28) పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఆమె.. ఓటర్ల మద్దతుతో విజయం సాధిస్తాననే ఆశతో ఉన్నారు. అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందే ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో దివ్య ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. మరోవైపు ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక వెలువడిన ఫలితం అందరినీ మరింత భావోద్వేగానికి గురిచేసింది. వైసీపీ అభ్యర్థిపై దివ్య 352 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు తేలింది. గెలుపు వార్త తెలిసినప్పటికీ ఆ ఆనందాన్ని దివ్యతో పంచుకునే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఊరంతా సంబరాలు చేసుకోవాల్సిన వేళ.. విజయం సాధించిన అభ్యర్థి లేకపోవడం అందరినీ కలచివేస్తోంది. దివ్యకు ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడికి ఐదేళ్లు కాగా, చిన్నారికి కేవలం మూడు నెలల వయసు మాత్రమే. తల్లి ప్రేమకు దూరమైన ఆ చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ముందడుగు వేసిన దివ్య.. విజయం సాధించినా దాన్ని కళ్లారా చూసుకోకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ధుమంతునిగూడెంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.