CJP: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కే అరెస్ట్..!
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ జెండాతో భారీ ప్రదర్శన నిర్వహించాలన్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో కార్యక్రమం చేపట్టాలని భావించిన పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. కార్యక్రమానికి అనుమతి లేకపోవడం, ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉండటంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ, జాతీయ జెండాను ఎగురవేసి తీరుతామని దిప్కే ప్రకటించినట్లు తెలుస్తోంది.
సెంట్రల్ ఢిల్లీలో భారీగా భద్రతా బలగాలను మోహరించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉండటంతో, అనుమతి లేని ప్రదర్శన ద్వారా పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. అక్టోబర్ 16, 17 తేదీల్లో సెంట్రల్ పార్క్‌ను ప్రజల కోసం మూసివేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ప్రకటించింది. పండుగల సీజన్లో వ్యాపారాలు సాగాల్సిన సమయంలో ఈ ఆంక్షల వల్ల వినియోగదారుల రాక తగ్గి తమకు నష్టం జరుగుతోందని పరిసర ప్రాంతాల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిరసనకు అసలు కారణం. గతంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్టు చేయగా, వారికి ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీనిని వ్యతిరేకిస్తూ పార్టీ ‘లెహ్రా దో తిరంగా’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. జాతీయ జెండాను ఎగురవేయడం నేరం కాదని దిప్కే వాదిస్తుండగా, అనుమతి లేని ప్రదర్శనలతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటమే తమ చర్యల ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.