Digital Arrest: డిజిటల్ అరెస్ట్ పేరుతో జ్యోతిష్యుడికి టోకరా.. పోలీసులమంటూ బెదిరించి రూ.70 లక్షలు స్వాహా..!
గుంటూరు ఉద్యోగ నగర్‌కు చెందిన జ్యోతిష్యుడు జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసానికి బలయ్యారు. తన పేరుతో 17 కేసులు నమోదయ్యాయని, అరెస్ట్ చేస్తామని బెదిరించిన సైబర్ నేరగాళ్లు.. ఆర్బీఐ ఖాతాల పరిశీలన పేరుతో ఐదు విడతల్లో రూ.70 లక్షలు బదిలీ చేయించుకున్నారు.
ఒక ఫోన్ కాల్.. అందులో వినిపించిన పోలీసుల పేర్లు.. తనపై కేసులు నమోదయ్యాయంటూ వచ్చిన బెదిరింపులు.. ఇంకేముంది, ఏం జరుగుతుందో తెలియక ఓ జ్యోతిష్యుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. అరెస్ట్ చేస్తామంటూ భయపెట్టి, విచారణ పేరుతో ఆయన నుంచి ఏకంగా రూ.70 లక్షలు కాజేశారు. గుంటూరు నగరంలోని ఉద్యోగ నగర్‌కు చెందిన జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి ఈ మోసానికి బాధితుడయ్యారు. 2025లో జరిగిన ఈ ఘటనపై ఆయన తాజాగా పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాదాపు ఏడాది తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
2025 సెప్టెంబర్ 4న రామలింగేశ్వర శాస్త్రికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. ఆయన పేరుతో బెంగళూరులో సిమ్ కార్డు తీసుకున్నారని, దాని ద్వారా ఓ పోలీసు అధికారి కుమార్తెకు అసభ్యకర సందేశాలు పంపించారని ఫోన్ చేసిన వ్యక్తులు చెప్పారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 17 కేసులు నమోదయ్యాయని, విచారణకు సహకరించకపోతే అరెస్ట్ తప్పదని హెచ్చరించారు. మొదట బెంగళూరుకు, అక్కడి నుంచి ఢిల్లీకి రావాల్సి ఉంటుందని చెప్పడంతో ఆయన ఆందోళనకు గురయ్యారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా కేసుల్లో ఇరుక్కుంటానేమోనని భయపడ్డారు.
ఆ భయాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు మరో కథ అల్లారు. సదాఖాన్ అనే వ్యక్తికి సంబంధించిన ఆస్తి విక్రయ వ్యవహారంలో కమీషన్ తీసుకున్నారని, ఆ అంశంలోనూ కేసు నమోదైందని చెప్పారు. ఇలా రెండు కేసుల్లో ఇరుక్కున్నట్లు నమ్మించారు. వాటి నుంచి బయటపడాలంటే ఆర్బీఐ ద్వారా బ్యాంకు ఖాతాల పరిశీలన జరగాలని, అందుకోసం ఖాతాల్లోని డబ్బులను తాము సూచించిన ఖాతాలకు బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు. పోలీసుల విచారణ పేరుతో మాట్లాడుతుండటంతో రామలింగేశ్వర శాస్త్రి వారు చెప్పినట్లుగానే చేయడానికి అంగీకరించారు.
నిందితుల సూచనల మేరకు 2025 సెప్టెంబర్ 8 నుంచి అక్టోబర్ 14 వరకు ఐదు విడతల్లో డబ్బులు బదిలీ చేశారు. యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ ఖాతాల నుంచి మొత్తం రూ.70 లక్షలను సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలకు పంపించారు. అయితే ఎంతకాలం గడిచినా ఆ నగదు తిరిగి రాకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తులను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఎలాంటి స్పందన రాలేదు. అప్పటికే తనను డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేశారని ఆయనకు అర్థమైంది.
ఇటీవల ఇలాంటి సైబర్ మోసాలపై అవగాహన పెరుగుతుండటంతో రామలింగేశ్వర శాస్త్రి చివరకు పోలీసులను ఆశ్రయించారు. పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఐదు విడతల్లో బదిలీ అయిన రూ.70 లక్షలు ఏయే బ్యాంకు ఖాతాలకు చేరాయి? ఆ ఖాతాల వెనుక ఎవరున్నారు? ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. కాగా, డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి డబ్బులు అడిగే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి సందర్భాల్లో నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.