Tea: ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు కొందరిలో ఎసిడిటీ, గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలకు కారణం కావచ్చు. టీ తాగే సమయం, పరిమాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకోండి.
ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే చాలామంది చేసే మొదటి పని టీ తాగడం. బెడ్ కాఫీ లేదా వేడి వేడి టీ తాగితేనే రోజంతా ఉత్సాహంగా ఉంటామని భావిస్తుంటారు. కొందరికైతే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. అయితే ఇన్నాళ్లూ మీరు అలవాటుగా చేస్తున్న ఈ పని విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు ఉన్నవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేదంటే కొందరిలో జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీలో ఉండే కెఫీన్ మెదడును చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే ఇదే కెఫీన్ కొంతమందిలో కడుపుపై ప్రభావం చూపించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలు ఉన్నవారికి ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు అసౌకర్యం కలగవచ్చు. కడుపులో మంట, వికారం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ప్రతి ఒక్కరికీ ఇలా జరుగుతుందని కాదు. వ్యక్తి శరీరతత్వం, టీ తయారుచేసే విధానం, తాగే పరిమాణాన్ని బట్టి ప్రభావం మారుతుంది.
మరికొందరికి ఉదయం టీ తాగిన వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంటుంది. దీనికి టీలో ఉండే కెఫీన్ పేగుల కదలికలను ప్రేరేపించడం ఒక కారణం కావచ్చు. అయితే కొందరిలో ఇదే అలవాటు కడుపులో అసౌకర్యం, గ్యాస్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా మరీ చిక్కగా తయారుచేసిన టీని ఎక్కువ పరిమాణంలో తాగేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
అయితే ఉదయం టీ తాగే అలవాటును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. నిద్రలేవగానే ముందుగా ఒక గ్లాసు నీరు తాగడం మంచిది. ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు కడుపులో మంట లేదా వికారం కలుగుతుంటే, తేలికపాటి అల్పాహారం తీసుకున్న తర్వాత టీ తాగి చూడవచ్చు. టీని మరీ చిక్కగా తయారుచేయకుండా, చక్కెర పరిమాణాన్ని తగ్గించుకోవాలి. రోజులో పదేపదే టీ తాగే అలవాటు ఉంటే కెఫీన్ తీసుకునే పరిమాణంపై కూడా శ్రద్ధ పెట్టాలి.
అలాగే సాయంత్రం లేదా రాత్రి టీ తాగడం వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతున్నవారు ఆ సమయంలో టీని తగ్గించడం మంచిది. తరచూ గుండెల్లో మంట, కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు ఎదురవుతుంటే మాత్రం వాటిని సాధారణంగా తీసుకోకుండా వైద్యులను సంప్రదించాలి. మొత్తానికి ఉదయాన్నే టీ తాగడం తప్పు కాదు. కానీ మీ శరీరానికి అది ఎలా సరిపోతుందో గమనిస్తూ, సరైన సమయంలో, మితమైన పరిమాణంలో తీసుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.